Share News

గ్లామర్‌ దాటిన పరిణతి

ABN , Publish Date - Sep 06 , 2026 | 03:43 AM

సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి అరంగేట్రం చేసినా, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంటూ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తోంది...

గ్లామర్‌ దాటిన పరిణతి

సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి అరంగేట్రం చేసినా, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంటూ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తోంది అనన్య పాండే. అభినయంలో పరిణతిని చూపిస్తూ, తరచూ వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకుంటున్న ఈ గ్లామరస్‌ తార, ఇటీవల వివిధ ఇంటర్వ్యూలలో తన కెరీర్‌, వ్యక్తిగత ఎదుగుదల, భవిష్యత్తు ప్రణాళికలపై ఆసక్తికర విశేషాలను పంచుకుంది.

సినీ వారసత్వంతో ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’ సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అనన్య పాండే.. తొలి చిత్రం నుంచే విమర్శకులు, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అయితే, ప్రారంభంలో ఆమెపై పడిన ‘స్టార్‌ కిడ్‌’ ముద్ర, గ్లామరస్‌ పాత్రలకే పరిమితం చేసే చట్రం నుంచి బయటపడటం ఆమెకు పెద్ద సవాలుగా మారింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దీనిపై స్పందిస్తూ ‘‘తొలినాళ్లలో నన్ను అందరూ ఒక ప్రత్యేకమైన బాక్స్‌లో పెట్టి చూశారు. కానీ నేనెప్పుడూ ఆ హద్దులను దాటడానికే ప్రయత్నించాను. ప్రతి కొత్త సినిమాతో నన్ను నేను రీడిఫైన్‌ చేసుకోవడం, నటిగా ఎదగడమే నా లక్ష్యం’’ అని చెప్పుకొచ్చింది.

‘కాల్‌ మీ బే’ నుంచి ‘సీటీఆర్‌ఎల్‌’ వరకు

2024-25 కాలం అనన్య కెరీర్‌లో ఒక పెద్ద మలుపుగా చెప్పవచ్చు. ‘ఖో గయే హమ్‌ కహా’, ‘కాల్‌ మీ బే’, విక్రమాదిత్య మోత్వానే తెరకెక్కించిన ‘సీటీఆర్‌ఎల్‌’ వంటి ప్రాజెక్టులు ఆమె అభినయ ముద్రను మార్చివేశాయి. దాదాపు ప్రతి ఫ్రేమ్‌లోనూ తనే కనిపించాల్సి రావడంపై తొలినాళ్లలో కాస్త కంగారు పడిన మాట వాస్తవమేనని అంగీకరించింది. ‘‘స్ర్కీన్‌ నిండా నేనే ఉంటాను, ప్రేక్షకులు నా నటన చూసి బోర్‌ ఫీలవుతారేమో అని భయపడ్డాను. కానీ, డిజిటల్‌ కంటెంట్‌, సోషల్‌ మీడియా ప్రభావాల చుట్టూ తిరిగే ఈ కథలకు లభించిన ఆదరణ నాలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపింది’’ అని చెప్పుకొచ్చింది.

సోషల్‌ మీడియా ఒత్తిళ్లు

డిజిటల్‌ ప్రపంచంలో జీవిస్తున్న యువత అనుభవిస్తున్న సైబర్‌ ఒత్తిడిపై అనన్య ఎంతో పరిణతితో మాట్లాడింది. ‘‘ప్రారంభంలో ట్రోల్స్‌ చూసినప్పుడు నా ఆత్మవిశ్వాసం దెబ్బతినేది. నేను కూడా మనిషినే కాబట్టి ఆ బాధ సహజం. కానీ కాలక్రమేణ నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ఇతరుల అభిప్రాయాలను మనం మార్చలేం, కానీ వాటికి మనం ఎలా స్పందిస్తున్నామనేది మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి థెరపీ తీసుకోవడం, మనస్ఫూర్తిగా పనిపై దృష్టి పెట్టడం నాకు ఎంతో సహాయపడ్డాయి’’ అని అనన్య చెప్పిన మాటలు నేటి యువతరానికి మార్గదర్శకంగా నిలుస్తాయి.


సెట్‌ వెనుక నిజాయతీ

ఇంటర్వ్యూలలో కేవలం ప్రొఫెషనల్‌ విశేషాలే కాకుండా, తన వ్యక్తిగత ఇష్టాయిష్టాలను, రోజువారీ అలవాట్లను ఎలాంటి దాపరికం లేకుండా చెప్పడం అనన్య ప్రత్యేకత. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలలో తన సరదా కోణాన్ని బయటపెడుతూ ‘ఫ్రెండ్స్‌’ సిరీ్‌సలోని జోయి క్యారెక్టర్‌ లాగా తనకు వేరేవాళ్లతో ఆహారాన్ని పంచుకోవడం అస్సలు నచ్చదని నవ్వుతూ చెప్పింది. అంతేకాకుండా ఫ్రెండ్స్‌ గ్రూప్‌లో ఏ హోటల్‌కి వెళ్లాలి? ఏం తినాలి? అనే విషయాలలో తనే కాస్త ఆధిపత్యం చెలాయిస్తుంటానని సరదాగా పంచుకుంది. ఈ తరహా నిష్కల్మషమైన సంభాషణలే ఆమెను అభిమానులకు మరింత దగ్గర చేస్తున్నాయి.

సరికొత్త జానర్ల వేట

కెరీర్‌ పరంగా ఇప్పుడు అనన్య పాండే దూసుకుపోతోంది. అక్షయ్‌ కుమార్‌, ఆర్‌.మాధవన్‌ వంటి దిగ్గజ నటులతో కలిసి 1920ల నాటి కోర్ట్‌రూమ్‌ డ్రామా నేపథ్యంలో వచ్చిన ‘కేసరి చాప్టర్‌ 2’ (జలియన్‌ వాలాబాగ్‌ నేపథ్యంలో సాగే సి.శంకర్‌ నాయర్‌ బయోపిక్‌) చిత్రంలో ఆమె నటకు మంచి గుర్తింపు లభించింది. అలాగే లక్ష్యతో కలిసి చేసిన ‘చాంద్‌ మేరా దిల్‌’, కార్తీక్‌ ఆర్యన్‌తో ‘తూ మేరీ మై తేరా.. మై తేరా తూ మేరీ’ వంటి రొమాంటిక్‌ చిత్రాలతోనూ అలరించింది. కేవలం కమర్షియల్‌ వినోదాలకే పరిమితం కాకుండా, కథలో బలం ఉండి సమాజంలోని భావోద్వేగ సత్యాలను ప్రతిబింబించే పాత్రల వైపు మొగ్గు చూపుతున్నట్లు వివరించింది.

సరికొత్తగా అడుగులు

ఒకప్పుడు కేవలం నటుడి కూతురిగా పరిచయమై, విమర్శల తుపానును తట్టుకుని, నేడు స్వయంకృషితో బాలీవుడ్‌ అగ్రశ్రేణి నటీమణుల సరసన నిలిచింది అనన్య పాండే. అభినయంలో నిరంతరం మెరుగులు దిద్దుకుంటూ, కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ సాగుతున్న ఆమె సినీ ప్రయాణం రాబోయే రోజుల్లో భారతీయ చిత్రసీమలో మరిన్ని సంచలనాలకు వేదిక కానుందనడంలో ఎలాంటి సందేహం లేదు!

ఈ వార్తలు కూడా చదవండి..

ఆ నిర్మాణాల నాణ్యత విషయంలో రాజీపడొద్దు: సీఎం రేవంత్‌‌రెడ్డి

సన్నబియ్యం అమ్మితే రేషన్ కార్డు తొలగిస్తాం: మంత్రి తుమ్మల

రైతుల జీవితాలతో రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నారు.. హరీశ్‌రావు ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 06 , 2026 | 03:44 AM