జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవం.. ఈ రోజే ఎందుకు నిర్వహిస్తారంటే..
ABN , Publish Date - Jan 25 , 2026 | 11:48 AM
నేడు(జనవరి 25) జాతీయ ఓటరు దినోత్సవం. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతీ ఏటా ఇదే రోజున ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఇవాళ ఓటు హక్కుకు ఉండే ప్రాధాన్యత గురించి తెలియజేస్తూ అధికారులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.
ఇంటర్నెట్ డెస్క్: నేడు(జనవరి 25) జాతీయ ఓటరు దినోత్సవం(National Voters’ Day). కేంద్ర ఎన్నికల సంఘం ప్రతీ ఏటా ఇదే రోజున ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఇవాళ ఓటు హక్కుకు ఉండే ప్రాధాన్యత గురించి తెలియజేస్తూ అధికారులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ జాతీయ ఓటరు దినోత్సవాన్ని దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 2011లో ప్రారంభించారు. ఇక అప్పటి నుంచి ఏటా జనవరి 25వ తేదీన నేషనల్ ఓటర్స్ డే జరుపుకుంటున్నాం. అయితే జనవరి 25నే ఎందుకు నిర్వహిస్తారనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే దీని వెనుక ఉన్న అసలు కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...
చరిత్ర
1950 జనవరి 25వ తేదీన జాతీయ ఎన్నికల సంఘం(సీఈసీ) ఏర్పాటు జరిగింది. ఈ క్రమంలో అనేక ఎన్నికలు నిర్వహించారు. అయితే కాలక్రమేణా 18 ఏళ్ల వయసు వచ్చిన వారంతా ఓటు హక్కు(Youth voting India) పొందడానికి పెద్దగా ఆసక్తి చూపించక పోవడం, కొన్ని సందర్భాల్లో ఓటర్ల సంఖ్య 20 నుంచి 25 శాతానికి తగ్గిపోవడం ఎన్నికల సంఘం అధికారులు గుర్తించారు. ఇదే విషయాన్ని 2011లో ఎన్నికల కమిషన్ మన్మోహన్ సింగ్ సర్కారుకు వివరించింది. దీంతో దీనిపై సుదీర్ఘంగా మన్మోహన్ ప్రభుత్వం చర్చించింది. దేశ యువత ఓటరుగా పేరు నమోదు చేసుకుని ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించాలని భావించింది.
ఈ ఉద్దేశంతో మన్మోహన్ సింగ్ సర్కారు 2011లో జనవరి25వ తేదీని జాతీయ ఓటరు దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించింది. ఇక అప్పటి నుంచి 25న భారతదేశంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తోంది. ఇవాళ(ఆదివారం)16వ జాతీయ ఓటరు దినోత్సవం. ఈ ఏడాది నేషనల్ ఓటర్స్ డే థీమ్ ఏంటంటే.. 'మై ఇండియా, మై ఓట్ ఓటు'. దీని ట్యాగ్‌లైన్ 'భారత ప్రజాస్వామ్యానికి కేంద్ర బిందువుగా పౌరుడు'. ఇక ఈ రోజున ఎన్నికల సంఘం ప్రజలు, విద్యార్థులకు ఓటు విలువ, ఎన్నికల ప్రాముఖ్యత గురించి పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తుంది. ఓటు ప్రాముఖ్యతతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి వివరించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంది.
ఓటింగ్ ఎందుకు ముఖ్యం?
భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం అనే విషయం అందరికీ తెలుసు. ఇక్కడ పౌరులకు తమ నాయకులను ఎన్నుకునే అధికారం ఉంది. ఎన్నికల ద్వారా తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకుంటారు. ఓటు అనేది ప్రజలకు అభివృద్ధి కోసం, సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే ప్రతినిధులను ఎన్నుకోవడానికి వీలు కల్పిస్తుంది. ప్రతి ఓటు ఎంతో ముఖ్యమైనదని, అది దేశ భవిష్యత్తును తీర్చిదిద్దగలదని 'జాతీయ ఓటర్ల దినోత్సవం' పౌరులకు గుర్తు చేస్తుంది.
ఓటింగ్ వయస్సులో మార్పు
ప్రస్తుతం మన దేశంలో 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పిస్తున్నారు. అయితే గతంలో ఓటు వేయడానికి కనీస వయస్సు 21 సంవత్సరాలుగా ఉండేది. 1988లో అమల్లోకి వచ్చిన 61వ రాజ్యాంగ సవరణ ప్రకారం 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించారు. ఈ మార్పు ఎక్కువ మంది యువత ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనడానికి వీలు కల్పించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ఎయిరిండియాకు రూ.1,100 కోట్లు..
గణతంత్ర దినోత్సవం..982 మంది పోలీసులకు అవార్డులు