Share News

దలైలామా వారసుడిని నిర్ణయించేదెవరు?

ABN , Publish Date - Nov 26 , 2026 | 05:48 AM

త కొన్ని దశాబ్దాలుగా టిబెట్‌ బౌద్ధులకు అత్యున్నత ఆధ్యాత్మిక నేతగా వ్యవహరిస్తున్న 14వ దలైలామా వయస్సు పెరుగుతుండటంతో (ప్రస్తుతం 91 ఏళ్లు).. ఆయన వారసుడు ఎవరు అన్నదానిపై మరోసారి గట్టిగా చర్చ నడుస్తోంది.

దలైలామా వారసుడిని నిర్ణయించేదెవరు?
dalailama

  • ప్రాచీన నిబంధనల ప్రకారమే జరగాలంటున్న చైనా.. ఆ అధికారం ‘గాడెన్‌ పొడ్రాంగ్‌ ట్రస్టు’దేనన్న దలైలామా

  • చైనాను నిలువరించేందుకు అమెరికా కసరత్తు

  • భారత్‌తో కలిసి పని చేయాలంటూ అమెరికా కాంగ్రెస్‌ కమిటీ నివేదిక

  • ఢిల్లీలో దలైలామాకు బంగళాను కేటాయించిన కేంద్రం

గత కొన్ని దశాబ్దాలుగా టిబెట్‌ బౌద్ధులకు అత్యున్నత ఆధ్యాత్మిక నేతగా వ్యవహరిస్తున్న 14వ దలైలామా వయస్సు పెరుగుతుండటంతో (ప్రస్తుతం 91 ఏళ్లు).. ఆయన వారసుడు ఎవరు అన్నదానిపై మరోసారి గట్టిగా చర్చ నడుస్తోంది. ఇది తమ పరిధిలోని అంశమని చైనా పట్టుబడుతుండగా, చైనాను నియంత్రించే ఉద్దేశంతో అమెరికా పావులు కదుపుతోంది. మరోవైపు, ఢిల్లీలో దలైలామాకు ఓ భవనాన్ని కేటాయిస్తూ కేంద్రప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. ఆయన వారసుడి ఎంపిక ప్రక్రియ నేపథ్యంలోనే ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

సజీవ బోధిసత్వుడిగా కొలిచే టిబెటన్లు

దలైలామా పూర్తి పేరు ‘జెట్‌సన్‌ జాంపెల్‌ ఉంగా లొబ్‌సంగ్‌ యెషె టెన్‌జిన్‌ గ్యత్సో’. 1959లో చైనా టిబెట్‌ను ఆక్రమించటంతో తన అనుచరులతో కలిసి దలైలామా భారత్‌కు తరలివచ్చారు. నాటి నుంచీ మనదేశంలోనే ఆశ్రయం పొందుతున్నారు. ధర్మశాల కేంద్రంగా టిబెట్‌ ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దాని అధిపతిగా బాధ్యతలు నిర్వహించారు. టిబెటన్లు దలైలామాను జీవించి ఉన్న బోధిసత్వుడిగా, అవలోకితేశ్వర అవతారంగా ఆరాధిస్తుంటారు. ఆధ్యాత్మిక, రాజకీయ, దైనందిన జీవితంలో ఆయన మార్గనిర్దేశనం ప్రకారం నడుచుకుంటారు. టిబెట్‌ వాసులు విశ్వసించే మహాయాన, వజ్రయాన బౌద్ధాన్ని, కాలచక్ర బోధనలను ప్రచారం చేస్తూ దలైలామా ప్రపంచవ్యాపంగా పర్యటించారు. మతం, సైన్స్‌, పర్యావరణం, ఆర్థికరంగం, మహిళాహక్కులు, న్యూరోసైన్స్‌ తదితర అంశాల గురించి ఆయన ప్రసంగించారు.


1989లో ఆయనకు నోబెల్‌ శాంతి బహుమతి లభించింది. అహింస విషయంలో మన జాతిపిత గాంధీజీకి వారసుడు దలైలామానే అని ప్రఖ్యాత టైమ్‌ మ్యాగజైన్‌ ప్రకటించింది. 2011లో టిబెట్‌ ప్రవాస ప్రభుత్వం రాజకీయ అధినేత బాధ్యతల నుంచి దలైలామా తప్పుకొన్నారు. అనంతరం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ‘సెంట్రల్‌ టిబెటన్‌ అడ్మినిస్ట్రేషన్‌’ ఆయన స్థానంలో బాధ్యతలు నిర్వర్తిస్తోంది.

మధ్యేమార్గమే పరిష్కారం

తమ మాతృభూమి అయిన టిబెట్‌ సమస్యను చైనాతో సామరస్యంగా పరిష్కరించుకోవటానికి దలైలామా 1970ల నుంచీ మధ్యేమార్గాన్ని ప్రతిపాదిస్తున్నారు. దీని ప్రకారం, టిబెట్‌ చైనాలో భాగంగానే ఉంటుంది. కానీ, తమ సంస్కృతీ సంప్రదాయాలు, గుర్తింపు తదితర అంశాలపై టిబెటన్లకు పూర్తి హక్కులు ఉండాలి. ఇరుపక్షాలు చర్చల ద్వారా ఒక నిర్ణయానికి రావాలని సూచిస్తున్నారు. కానీ, చైనా మొండిపట్టుతో ఇది ముందుకు కదలటం లేదు. దలైలామా వారసుడిని ఎన్నుకునే ప్రక్రియ పూర్తిగా టిబెట్‌ బౌద్ధుల మత విశ్వాసాలకు అనుగుణంగా జరుగుతుంది. దలైలామా మరణానంతరం జన్మించిన బాలురను సీనియర్‌ లామాలు పరిశీలించి, వారిలో ఒకరిని కొత్త దలైలామాగా ఎంపిక చేసి ప్రకటిస్తారు. ఆ బాలుడికి యుక్తవయస్సు వచ్చే వరకూ ఆధ్యాత్మిక అంశాల్లో కఠోరమైన శిక్షణనిస్తారు. గతేడాది తన 90వ జన్మదినం సందర్భంగా తన వారసుడిని ఎన్నుకునే అధికారం తన కార్యాలయమైన ‘గాడెన్‌ పొడ్రాంగ్‌ ట్రస్టు’కు మాత్రమే ఉంటుందని దలైలామా ప్రకటించారు. కొత్త దలైలామా టిబెట్‌ బయట కూడా జన్మించే అవకాశం ఉందన్నారు. దీనిని చైనా తీవ్రంగా వ్యతిరేకించింది. దలైలామా అనే వ్యవస్థ ప్రాచీన చైనాలోని క్వింగ్‌ రాచరికానికి సంబంధించినదని, కాబట్టి, కొత్త వారసుడి ఎంపిక ఆనాటి ప్రాచీన నిబంధనలకు అనుగుణంగానే జరగాలని పట్టుబడుతోంది. దీనిని తమ మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటమేనని టిబెటన్లు భావిస్తున్నారు.


దలైలామా వారసుడి ఎంపికను చైనా ఓ అంతర్జాతీయ వివాదంగా మార్చేందుకు ప్రయత్నించవచ్చని అమెరికా కాంగ్రెస్‌కు చెందిన ‘అమెరికా-చైనా ఆర్థిక, భద్రత సమీక్ష కమిషన్‌’ ఇటీవల హెచ్చరించింది. దీనిని అడ్డుకోవటానికి వీలుగా, భారత ప్రభుత్వంతో కలిసి పని చేయాలని సిఫారసు చేసింది. దలైలామా వారసుడిని ఎన్నుకునే అధికారం ‘గాడెన్‌ పొడ్రాంగ్‌ ట్రస్టు’కు మాత్రమే ఉందని, చైనా ఒకవేళ ఎవరినైనా వారసుడిగా ప్రకటించినా అమెరికా గుర్తించవద్దని సూచించింది. మరోవైపు, ఢిల్లీలోని పండిట్‌ రవిశంకర్‌శుక్లా వీధిలో ఉన్న ఓ టైప్‌-7 బంగళాను కేంద్రప్రభుత్వం దలైలామా కార్యాలయమైన గాడెన్‌ పొడ్రాంగ్‌ ట్రస్టుకు కేటాయించింది. దీనిపై సంబంధిత కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ఎటువంటి ప్రకటన జారీ చేయలేదు. ఎన్నడూ లేనిది దలైలామాకు ఢిల్లీలో అధికారిక బంగళాను కేటాయించటంతో, వారసుడి ఎంపిక అంశం మరోమారు చర్చనీయాంశమైంది.

- సెంట్రల్‌ డెస్క్‌

ఈ వార్తలు కూడా చదవండి...

మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి

Updated Date - Nov 26 , 2026 | 06:02 AM