ఇది గెలుపు కాదు లూటీ.. మేం పుంజుకుంటాం.. బెంగాల్‌లో షాకింగ్ తీర్పుపై మమతా బెనర్జీ
ABN , Publish Date - May 04 , 2026 | 08:31 PM
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార తృణముల్ కాంగ్రెస్ (TMC) అనూహ్యంగా ఓటమి పాలవడంతో, మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫలితాలు ప్రజా తీర్పు కాదని, ఇది పూర్తిగా 'లూటీ' అని ఆమె ఆరోపించారు.
కోల్‌కతా, మే 4: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మమతా బెనర్జీ పార్టీ తృణముల్ కాంగ్రెస్ వర్గాల్నిదిగ్భ్రాంతికి గురిచేశాయి. నాలుగోసారి అధికారం దక్కించుకోవాలని ఆశించిన మమతా బెనర్జీకి ఈ ఫలితాలు పెద్ద షాకే ఇచ్చాయి. ఈ ఓటమిపై స్పందించిన ఆమె, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చిన గెలుపు కాదని, పూర్తిగా 'లూటీ' అని ఆమె ఆరోపించారు.
ఫలితాల సరళిని బట్టి మమతా బెనర్జీ కేంద్ర ఎన్నికల కమిషన్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. ఎన్నికల కమిషన్ ఇప్పుడు బీజేపీ కమిషన్‌గా మారిందని ఆమె ఆరోపించారు.
బీజేపీ సుమారు 100కు పైగా స్థానాలను లూటీ చేసిందని, దీనిపై తాము చేసిన ఫిర్యాదులను అధికారులు పట్టించుకోలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అనైతిక విజయమని, సెంట్రల్ ఫోర్సెస్, కేంద్ర మంత్రుల అండతో చేసిన అక్రమమని ఆమె పేర్కొన్నారు.
తిరిగి వస్తాం - మమత ధీమా
ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ, తృణమూల్ కాంగ్రెస్ మళ్లీ బలంగా పుంజుకుంటుందని (Bounce Back) మమతా బెనర్జీ ఆశాభావం వ్యక్తం చేశారు. అక్రమాలకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.
బీజేపీ చరిత్రాత్మక గెలుపు
కాగా, బెంగాల్ గడ్డపై బీజేపీ అసాధారణ విజయాన్ని నమోదు చేసింది. తాజా లెక్కల ప్రకారం బీజేపీ 142 స్థానాల్లో విజయం సాధించి, మరో 66 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, గతేడాది బీహార్ ఫలితాల సమయంలోనే తాను చెప్పినట్లుగా 'గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు కమలం వికసించిందని' వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి..
ఐదు రాష్ట్రాల ఫలితాల వేళ ప్రధాని మోదీ ఆసక్తికర పోస్ట్.. నైపుణ్యం, కృషి, కరుణపై సందేశం
ఓట్ల లెక్కింపు వేళ.. మురుగు కాలువలో వీవీప్యాట్ స్లిప్పులు.. స్పందించిన ఈసీ