Share News

కౌమార దశలో విటమిన్‌ బీ12 లోపం

ABN , Publish Date - Nov 28 , 2026 | 05:08 AM

భారత్‌లో విటమిన్‌ బీ12 లోపం తీవ్రమైన సమస్యగా విస్తరిస్తోంది.

కౌమార దశలో విటమిన్‌ బీ12 లోపం
vitaminb12

  • దేశంలో 66 శాతం మందిలో సమస్య తీవ్రం

  • అబ్బాయిల్లో అధికం.. ఐసీఎంఆర్‌ సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ, నవంబరు 27: భారత్‌లో విటమిన్‌ బీ12 లోపం తీవ్రమైన సమస్యగా విస్తరిస్తోంది. ముఖ్యంగా కౌమారదశలో ఉన్న వారిలో మూడింట రెండు వంతులు అంటే సుమారు 66 శాతం మంది విటమిన్‌ బీ12 లోపంతో బాధపడుతున్నారని భారత వైద్య పరిశోధన మండలి - నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఐసీఎంఆర్‌-ఎన్‌ఐఎన్‌) సంయుక్త సర్వేలో వెల్లడైంది. బాలికల్లో కంటే అబ్బాయిల్లో ఈ లోపం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. కౌమారదశ (10 ఏళ్ల నుంచి 19 ఏళ్ల మధ్య)లో ఉన్న అబ్బాయిల్లో 66.1 శాతం మందికి, బాలికల్లో 65.4 శాతం మందికి విటమిన్‌ బీ12 లోపం ఉన్నట్టు తేలింది. రక్తంలో విటమిన్‌ బీ12 స్థాయి 230 పీజీ/ఎంఎల్‌ కంటే తక్కువగా ఉంటే దాన్ని లోపంగా పరిగణిస్తారు. ‘సంపద’ (సర్వే ఫర్‌ అసెస్ మెంట్ ఆఫ్‌ మార్కర్స్‌ ఆఫ్‌ పాపులేషన్‌ హెల్త్‌, యాక్టివిటీ, డైట్‌, ఆంథ్రోపోమెట్రీ) సర్వేలో భాగంగా 2023-25 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 183 జిల్లాల పరిధిలోని 2 లక్షల మందికిపైగా ప్రజల నుంచి సేకరించిన రక్త నమూనాలను విశ్లేషించారు. కౌమార బాలికల్లో ఐరన్‌ లేదా ఫోలిక్‌ యాసిడ్‌ (విటమిన్‌ బీ9) లోపం కంటే విటమిన్‌ బీ12 లోపం సమస్య ఎక్కువగా కనిపించింది. విటమిన్‌ బీ12 లోపం కౌమార దశలోని వారికే పరిమితం కాలేదు. 20-59 ఏళ్ల మధ్య వయసున్న గర్భిణులు, పాలు ఇవ్వని మహిళల్లో 55.2 శాతం, అలాగే సంతానోత్పత్తి వయస్సు (15-49 ఏళ్లు) ఉన్న మహిళల్లో 57.4 శాతం మందిలో ఈ సమస్యను గుర్తించారు

ఇవి కూడా చదవండి...

హైదరాబాద్ ఫిష్ మార్కెట్‌లో ఫుడ్‌సేఫ్టీ తనిఖీలు.. కుళ్లిన చేపల స్వాధీనం

డిసెంబర్‌లోగా డీలిమిటేషన్ బిల్లు పాస్ కాకపోతే.. జనాభా ఆధారంగానే సీట్ల పెంపు: ఎంపీ లక్ష్మణ్

Updated Date - Nov 28 , 2026 | 05:09 AM