Share News

పైసా ముట్టను.. ఎవరినీ ముట్టనివ్వను

ABN , Publish Date - May 11 , 2026 | 06:24 AM

ఎన్నికల సమయంలో చెప్పినట్లే ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయబోనని తమిళనాడు సీఎం విజయ్‌ స్పష్టంచేశారు., ఒక్క పైసా కూడా ముట్టనని, ఎవరినీ ముట్టనివ్వనని....

పైసా ముట్టను.. ఎవరినీ ముట్టనివ్వను

చెన్నై, మే 10 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో చెప్పినట్లే ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయబోనని తమిళనాడు సీఎం విజయ్‌ స్పష్టంచేశారు., ఒక్క పైసా కూడా ముట్టనని, ఎవరినీ ముట్టనివ్వనని తేల్చిచెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఇది సరికొత్త ఆరంభమని, నిజమైన, లౌకిక, సామాజిక న్యాయంతో కూడిన ఒక నూతన శకం ప్రారంభం అవుతుందంటూ సినిమా స్టైల్లో తన చేతికున్న వాచ్‌ను చూపుతూ చెప్పారు. ఆదివారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సభా వేదిక నుంచి ఆయన తొలిసారిగా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘విజయ్‌ ఎప్పుడూ తప్పు చేయడు. అది మీ అందరికీ తెలుసు. అదే సమయంలో ఎవరినీ తప్పు చేయడానికి కూడా అనుమతించడు’ అని శపథం చేశారు. తప్పు చేస్తే ఎంతటి వారైనా, తన ప్రభుత్వ భాగస్వాములైనా కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోనని నిక్కచ్చిగా చెప్పారు. అవినీతి చేయాలనే ఆలోచనలు ఏమైనా ఉంటే మానుకోవాలని హెచ్చరించారు. వఎన్నికల సమయంలో తనను అవమానించిన, అపహాస్యం చేసిన వారి బాగోగులు కూడా పట్టించుకుంటానని, వారంతా తన ప్రజలేనన్నారు.

ఆకలి గురించి నాకు తెలుసు

తాను సాధారణ జీవితం గడిపే సామాన్యుడినే తప్ప.. దేవదూతను కాదని విజయ్‌ అన్నారు. కోట్లకు పడగెత్తిన కుటుంబం నుండి రాలేదని, సినిమాలలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన చంద్రశేఖర్‌ కుమారుడిగానే వచ్చానని చెప్పారు. పేదరికం, ఆకలి గురించి తనకు బాగా తెలుసన్నారు. కోట్లాది మంది ప్రజలు తనను గెలిపించి సీఎం పీఠంపై కూర్చోబెట్టారని, వారికి సేవ చేయడమే తన ధర్మమని చెప్పారు. సమానత్వమే తమ పార్టీ సూత్రమని, మైనార్టీ సోదరులకు అండగా ఉంటామన్నారు. ‘‘నేను మీ కుటుంబసభ్యుడి లాంటి వాడిని. మీరంతా నన్ను సినిమాల్లో ఉన్నత స్థాయిలో నిలిపారు. తమ్ముడూ రా.. అంటూ ప్రేమతో పిలిచారు కాబట్టే కోట్ల ఆదాయం వదులుకుని రాజకీయాల్లోకి వచ్చాను. అండగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నా. మా మేనిఫెస్టోలోని అన్ని హామీలను దశల వారీగా అమలు చేసి మాట నెలబెట్టుకుంటా’ అని విజయ్‌ ఉద్వేగంగా ప్రసంగించారు.


ఒక్కటే పవర్‌ సెంటర్‌!

తన పాలనలో ఒకే పవర్‌ సెంటర్‌ ఉంటుందని, అది తన నాయకత్వంలోనే ఉంటుందని తెలిపారు. అక్కడో పవర్‌ సెంటర్‌, ఇక్కడో పవర్‌ సెంటర్‌ అంటూ ప్రభుత్వంపై పెత్తనం చెలాయించే అధికార కేంద్రాలు ఉండవని (గత డీఎంకే పాలనను పరోక్షంగా ప్రస్తావిస్తూ) ప్రజలకు మాటిస్తున్నానన్నారు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులకు మేలుచేసే ప్రభుత్వం టీవీకే ప్రభుత్వమేనని, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. రాహుల్‌గాంధీకి, తనకు మద్దతిచ్చిన పార్టీల నేతలకు విజయ్‌ ధన్యవాదాలు తెలిపి తన ప్రసంగం ముగించారు.

ఈ వార్తలు కూడా చదవండి...

డీఎంకే ఓటమికి అవినీతి పాలనే కారణం: మంత్రి సత్యకుమార్

జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. ఎంపీ శ్రీ భరత్ ధ్వజం

సింగపూర్ మోడల్‌లో ఫిర్యాదుల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ప్లాన్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 11 , 2026 | 06:24 AM