వియత్నాంలో పర్యాటక బోటు బోల్తా..
ABN , Publish Date - Jul 12 , 2026 | 06:02 AM
వియత్నాంలో భారతీయుల విహార యాత్ర పెను విషాదంగా ముగిసింది. అప్పటిదాకా పర్యాటక బోటులో సాగిన సరదాలను సంద్రం ముంచేసింది....
15 మంది దుర్మరణం
మృతుల్లో ముగ్గురు ఆంధ్రులు, పదిమంది తమిళులు, ఇద్దరు కేరళీయులు
250 మంది డిస్ట్రిబ్యూటర్లను విదేశీ టూరుకు తీసుకెళ్లిన సెల్‌ఫోన్ కంపెనీ
సైట్ సీయింగ్‌కు మూడు బోట్లు.. 36 మందితో బయల్దేరిన బోటు మునక
21 మందిని రక్షించిన భద్రతా, నౌకా దళాలు
న్యూఢిల్లీ, చెన్నై, అమరావతి జూలై 11(ఆంధ్రజ్యోతి): వియత్నాంలో భారతీయుల విహార యాత్ర పెను విషాదంగా ముగిసింది. అప్పటిదాకా పర్యాటక బోటులో సాగిన సరదాలను సంద్రం ముంచేసింది. వియత్నాంలోని ఫూ క్వాక్ ద్వీపం సమీపంలో జరిగిన పడవ ప్రమాదంలో 15 మంది మరణించారు. 36 మంది ప్రయాణిస్తున్న బోటు తిరగబడి సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఆంధ్రులు చనిపోగా, మరొకరు అపస్మారక స్థితిలో ఉన్నారు. తమిళనాడుకు చెందిన పదిమంది ప్రాణాలు కోల్పోయారు. కేరళకు చెందిన ఇద్దరు మృత్యువాతపడ్డారు. తక్కిన 21 మందిని భద్రతాసిబ్బంది ఒడ్డుకు చేర్చారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మొబైల్ కంపెనీ టూర్ కోసం వెళ్లి
ప్రముఖ మొబైల్ ఫోన్ కంపెనీ వ్యాపార పర్యటనలో భాగంగా భారత్ నుంచి సుమారు 250 మంది పర్యాటకులను వియత్నాం తీసుకెళ్లింది. ఆంధ్రానుంచి 35మంది, తెలంగాణ నుంచి 40 మంది మొబైల్ డీలర్లు ఈ విహారయాత్రకు వెళ్లారు. శనివారం మూడు బోట్లలో పర్యాటకులు సైట్ సీయింగ్‌కు వెళ్లారు. 36 మంది ఓ బోటులో బయలుదేరారు. వారిలో 32 మంది పర్యాటకులు కాగా, నలుగురు సిబ్బంది ఉన్నారు. హాన్ మే రూట్ నుంచి అన్‌థోయ్ పోర్టుకు వెళ్లే సముద్రమార్గంలో వారంతా విహరిస్తుండగా, అకస్మాత్తుగా వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. అలల తీవ్రత చూస్తుండగానే పెరిగిపోయింది. కడలి కల్లోలంగా మారింది. 10.30 గంటల ప్రాంతంలో అన్‌థోయ్ పోర్టుకు 400 మీటర్ల దూరంలో బోటు తిరగబడి మునిగిపోయింది. బోటు నుంచి కొందరు దూకేశారు. మిగిలినవారు బోటుతోపాటే మునిగిపోయారు. వారిలో 15 మంది మరణించారు. సరిహద్దు భద్రతా దళం, నౌకా దళం బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని 21 మందిని ఎట్టకేలకు రక్షించగలిగాయి. ప్రతికూల వాతావరణం, అలల తీవ్రతతోపాటు ప్రమాదానికి గురైన పడవలో సాంకేతిక లోపం కోణంపైనా వియత్నాం అధికారులు విచారణ ప్రారంభించారు. హనోయిలోని భారత రాయబార కార్యాలయం కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటుచేసి, బాధితుల కుటుంబాలకు సమాచారం అందిస్తున్నాయి.
ప్రమాదంపై ప్రధాని మోదీ
వియత్నాం పడవ ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రాణాలతో బయటపడిన వారిని రాష్ట్రానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదంపై తమిళనాడు సీఎం విజయ్, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు చెందిన వారు సచివాలయంలోని కంట్రోల్‌రూం సిబ్బందిని 9885371189, 7997959754, 9989654807, 7997959779 ఫోన్ నెంబర్ల ద్వారా సంప్రదించవచ్చని తెలంగాణ అధికారులు పేర్కొన్నారు.
నీరంటే భయమే బతికించింది!
త్రుటిలో తప్పించుకున్న పాలమూరు వాసి
మహబూబ్‌నగర్ పట్టణానికి చెందిన లావా మొబైల్ ఫోన్ డిస్ట్రిబ్యూటర్ మహ్మద్ ముక్తదీర్ కూడా కంపెనీ ట్రిప్ మీద రెండు రోజుల క్రితం వియత్నాం వెళ్లారు. ఆయనతో పాటు వియత్నాం వెళ్లిన మిగతా టూరిస్టులు శనివారం ఉదయం బోటులో సముద్రంలోకి వెళ్లారు. ముక్తదీర్‌కు నీళ్లంటే భయం ఉండటంతో బోటు ఎక్కలేదు. అదే ఆయన ప్రాణాలను కాపాడింది. మధ్యాహ్నం 1:30 గంటలకు ముక్తదీర్ తాను సేఫ్‌గా ఉన్నానని ఇంటికి సందేశం పంపించాడు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఎంఎస్ఎంఈలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఆ ఘటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సీరియస్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News