వారణాసి విమానాశ్రయంలో పేలిన తుపాకీ.. ఇద్దరు సిబ్బందికి తీవ్రగాయాలు..
ABN , Publish Date - Aug 16 , 2026 | 12:52 PM
వారణాసి విమానాశ్రయంలో కాల్పులు కలకలం రేపాయి. ఆదివారం ఉదయం ఓ ప్రయాణికుడిని తనిఖీ చేస్తుండగా తుపాకీ పేలింది. దీంతో ఇద్దరు ఎయిర్‌పోర్టు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.
ఉత్తర్‌ప్రదేశ్: వారణాసి విమానాశ్రయం(Varanasi Airport)లో కాల్పులు కలకలం రేపాయి. ఇవాళ (ఆదివారం) ఉదయం ఓ ప్రయాణికుడిని తనిఖీ చేస్తుండగా అతని వద్ద తుపాకీ(Gun Fire) ప్రమాదవశాత్తూ పేలింది. దీంతో ఇద్దరు ఎయిర్‌పోర్టు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు వెంటనే అప్రమత్తమై బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అజంగఢ్‌కు చెందిన ఓ ప్రయాణికుడు తన భార్యతో కలిసి ముంబైకి వెళ్లేందుకు వారణాసి ఎయిర్‌పోర్టుకు వెళ్లాడు. ఉదయం 09:30 గంటలకు ఎయిర్ ఇండియా విమానం IX-1810 ఎక్కే ముందు తన వద్ద తుపాకీ, ఒక మ్యాగజైన్ ఉన్నాయని అధికారులకు సమాచారం అందించాడు. దీంతో ఆయుధాన్ని, దానికి సంబంధించిన పత్రాలను తనిఖీ చేస్తుండగా ఒక్కసారిగా తుపాకీ పేలింది. బుల్లెట్ మొదటగా నేలను తాకి, అనంతరం ఇద్దరు AAICLAS స్క్రీనర్లకు తగిలింది. దీంతో ఓ మహిళా సిబ్బంది తొడకు, మరో పురుషుడి చేతికి గాయమైంది.
ఈ ఘటనపై వారణాసి విమానాశ్రయ డైరెక్టర్ పునీత్ స్పందించారు. ఆయుధాల తనిఖీ సమయంలో ఓ ప్రయాణికుడి తుపాకీ నుంచి ఒక రౌండ్ పేలుడు జరిగిందని తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు స్క్రీనర్లు గాయపడగా.. చికిత్స నిమిత్తం వారిని న్యూలక్ష్మి ట్రామా సెంటర్‌కు తరలించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం గాయపడిన ఇద్దరు సిబ్బంది పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించామని, దర్యాప్తు జరుగుతోందని పునీత్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
అటల్‌జీ సేవలు స్ఫూర్తిదాయకం: ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
రెచ్చిపోయిన మోడల్.. బట్టలు విప్పేసి రైల్వే అధికారులపై దాడి..