Share News

వందేమాతరాన్ని అడ్డుకున్నారు!

ABN , Publish Date - Aug 16 , 2026 | 06:46 AM

కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకలో జాతీయ గేయం వందేమాతరాన్ని పూర్తిగా ఆలపించకుండా సోనియాగాంధీ అడ్డుకున్నారని బీజేపీ విమర్శించింది. దీనికి...

వందేమాతరాన్ని అడ్డుకున్నారు!

  • బహిరంగంగా అవమానించారు

  • సోనియాగాంధీపై బీజేపీ ఆగ్రహం

  • అడ్డుకోలేదు..ఆ సైగ కుర్చీ కోసం

  • కాంగ్రెస్‌ పార్టీ వివరణ

న్యూఢిల్లీ, ఆగస్టు 15: కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకలో జాతీయ గేయం వందేమాతరాన్ని పూర్తిగా ఆలపించకుండా సోనియాగాంధీ అడ్డుకున్నారని బీజేపీ విమర్శించింది. దీనికి సంబంధించిన వీడియోను ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్టు చేసింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ స్పందిస్తూ.. ‘‘తల్లి, కుమారుడు, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడికి వందేమాతరం పూర్తిగేయాన్ని ఆలపించడం ఇష్టం లేనట్టుంది. 1947కు ముందు ఉన్న వారి మనస్తత్వాలు.. ఆ తర్వాత కూడా మారలేదు.’’ అని ఆక్షేపించారు. ‘‘స్వాతంత్ర పోరాట వారసత్వం తమదేనని చెప్పుకొనే కాంగ్రెస్‌ పార్టీ ఇదేనా?’’ అని బీజేపీ అధికార ప్రతినిధి గోపాలకృష్ణ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై విశ్వహిందూ పరిషత్‌ తీవ్రంగా స్పందించింది. ‘‘వందేమాతరం పూర్తి గేయాన్ని అడ్డుకోవడం ద్వారా ఈ దేశాన్ని బహిరంగంగా అవమానించారు. దేశ ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ క్షమాపణలు చెప్పాలి.’’ అని డిమాండ్‌ చేసింది.

వివాదం లేదు.. సృష్టించారు: కాంగ్రెస్‌

బీజేపీ విమర్శలను కాంగ్రెస్‌ ఖండించింది. ‘‘వందేమాతరం గేయాన్ని ఆలపిస్తున్న సమయంలో ఖర్గే నిలబడి ఉన్నారు.. ఆయనకు కుర్చీ వేయాలని మాత్రమే సోనియా సైగ చేశారు. అంతేకానీ.. పూర్తిగేయాన్ని ఆపేయాలని ఆమె కోరలేదు.’’ అని కాంగ్రెస్‌ వివరించింది. ఈ వివాదంపై స్పందించిన సీనియర్‌ నేత జైరాం రమేశ్‌.. ‘‘1937, అక్టోబరు 28న కోల్‌కతాలో జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో వందేమాతరం గేయంలోని ప్రారంభ చరణాలను మాత్రమే ఆలపించాలని మహాత్మా గాంధీ, సర్దార్‌ పటేల్‌, రవీంద్రనాథ్‌ఠాగూర్‌ వంటి పెద్దలు నిర్ణయించారు.’’ అని గుర్తు చేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ ప్రతికార్యక్రమంలోనూ వందేమాతరం ఆలపిస్తోందని, దీనిపై వివాదం లేదని, వారు(బీజేపీ) సృష్టించారని స్పష్టం చేశారు. శనివారం నాటి కార్యక్రమంలో వందేమాతరం పూర్తి గేయాన్ని ఆలపించామని తెలిపారు. కాగా, ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో నిర్వహించిన పంద్రాగస్టు కార్యక్రమంలో ఖర్గే మాట్లాడుతూ.. బీజేపీ, ఆర్‌ఎ్‌సఎ్‌సలు ద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నాయని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ పథకాలకు ప్రధాని మోదీ పేర్లు మార్చేశారని.. అలానే ఏదో ఒకరోజు జాతీయ జెండాను కూడా మార్చేస్తారని విమర్శించారు.


అదొక్కటే మన అదృష్టం!

‘‘మోదీ తన ఎర్రకోట ప్రసంగంలో కాంగ్రెస్‌ చేసిన పనులను కూడా తానే చేశానని చెప్పుకొన్నారు. క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే..ఒక అదృష్టం ఏంటంటే.. ప్రపంచాన్ని తానే సృష్టించానని మాత్రం చెప్పలేదు!. ఆయనకు ఎవరూ అలా చెప్పాలన్న సలహా ఇవ్వలేదేమో.. ఎవరైనా ఇలాంటి సలహా ఇచ్చి ఉన్నా.. ప్రధాని ప్రసంగ పాఠంలో చేర్చి ఉన్నా... ఆయన ఈ ప్రపంచం తన వల్లే రక్షణ పొందుతోందని కూడా చెప్పేవారు.’’ అని ఖర్గే ఎద్దేవా చేశారు.

ఇవి కూడా చదవండి...

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య వేడుకలు.. జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

ఏపీ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. ఊరూవాడా జాతీయ జెండా రెపరెపలు

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 16 , 2026 | 06:46 AM