Share News

టీహెచ్‌డీసీ సొరంగ ప్రమాదం.. ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య..

ABN , Publish Date - Aug 15 , 2026 | 04:45 PM

ఉత్తరాఖండ్‌ చమోలి జిల్లా పిపల్‌కోటిలోని టీహెచ్‌డీసీ సొరంగంలో శుక్రవారం భారీ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. శిథిలాలు, నీటిని తొలగించిన సహయక సిబ్బంది మరో మృతదేహాన్ని వెలకితీశారు.

టీహెచ్‌డీసీ సొరంగ ప్రమాదం.. ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య..
Uttarakhand Tunnel Accident

ఉత్తరాఖండ్‌: చమోలి జిల్లా పిపల్‌కోటిలోని టీహెచ్‌డీసీ సొరంగంలో నిన్న (శుక్రవారం) భారీ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బిర్హి నది సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో నిర్మాణంలో ఉన్న సొరంగంలోకి పెద్దఎత్తున వరదనీరు, శిథిలాలు వచ్చి చేరాయి.

ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారి కోసం సహాయక బృందాలను అధికారులు రంగంలోకి దించారు. నిన్నటి నుంచి భారీగా చేరిన నీరు, శిథిలాలను తొలగిస్తూ.. నేడు మరో మృతదేహాన్ని వెలికితీశారు. దీంతో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. మరోవైపు, శిథిలాల కింద చిక్కుకుపోయిన మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.


ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈరోజు ఉదయం స్పందించారు. టీహెచ్‌డీసీ సొరంగంలోకి అకస్మాత్తుగా శిథిలాలు, నీరు చేరడంతో విధుల్లో ఉన్న కార్మికులు చిక్కుకుపోయారని తెలిపారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందగా.. చిక్కుకుపోయిన కార్మికుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వ జిల్లా యంత్రాంగంతో సహా అన్ని ఏజెన్సీలు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

అలాగే, ఈ ప్రమాదానికి కచ్చితమైన కారణాన్ని తెలుసుకునేందుకు సమగ్ర దర్యాప్తు జరుగుతోందని సీఎం పుష్కర్ సింగ్ ధామి చెప్పారు. ఏ నిర్మాణ ప్రాజెక్టులోనైనా పని చేసే సిబ్బంది భద్రతే తొలి ప్రాధాన్యంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారమే ఆదేశాలు జారీ చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కాగా, సొరంగం లోపల భారీగా చేరిన నీరు, బురద కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

అటవీశాఖ అధికారుల కాల్పుల్లో ముగ్గురు వేటగాళ్ల మృతి..

అలా ఉండుంటే.. పీవోకే ప్రజలు జమ్మూకశ్మీర్‌లో విలీనం కోరుకునేవారు: ఒమర్ అబ్దుల్లా

Updated Date - Aug 15 , 2026 | 04:53 PM