అటవీశాఖ అధికారుల కాల్పుల్లో ముగ్గురు వేటగాళ్ల మృతి..
ABN , Publish Date - Aug 15 , 2026 | 03:09 PM
కర్ణాటక రాష్ట్రం చామరాజనగర్ జిల్లాలో అటవీశాఖ అధికారుల కాల్పుల్లో ముగ్గురు వేటగాళ్లు మృతిచెందడం సంచలనంగా మారింది. జంతువులను వేటాడి వేటగాళ్లు తిరిగి వెళ్తుండగా ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి.
కర్ణాటక: చామరాజనగర్ జిల్లాలో అటవీశాఖ అధికారుల కాల్పుల్లో ముగ్గురు వేటగాళ్లు మృతిచెందడం సంచలనంగా మారింది. జంతువులను వేటాడి వేటగాళ్లు తిరిగి వెళ్తుండగా ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు వేటగాళ్లు మృతిచెందడం కలకలం రేపుతోంది. కావేరీ వన్యప్రాణుల అభయారణ్యానికి అనుబంధంగా ఉన్న హనూర్ రేంజ్‌లో ఇవాళ (శనివారం) తెల్లవారుజామున ఏడుగురు అటవీశాఖ సిబ్బంది గస్తీ కాస్తున్నారు.
అయితే వారికి నాటు తుపాకులతో వేట ముగించుకుని, వన్యప్రాణుల మాంసంతో వెళ్తున్న నలుగురు వేటగాళ్లు కనిపించారు. వారిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నించగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో అధికారులు ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ క్రమంలో ముగ్గురు వేటగాళ్లకు బుల్లెట్ గాయాలై.. అక్కడికక్కడే నేలకూలారు. మరో వేటగాడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడిలో శివరాజ్ అనే అటవీశాఖ అధికారికీ గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగా.. ముగ్గురు వేటగాళ్లు మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, పారిపోయిన నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
కాగా, హనూర్ రేంజ్‌లోని షగ్యా ప్రాంతంలో నిందితులు జింకలను వేటాడి తిరిగి వెళ్తుండగా అటవీశాఖ సిబ్బందికి ఎదురుపడ్డారని అధికారులు తెలిపారు. ఎదురుకాల్పుల అనంతరం వారి నుంచి మాంసాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే స్వాధీనం చేసుకున్న మాంసం జింకదా లేక మరేదైనా జంతువుదా? అనేది తేల్చేందుకు ఫోరెన్సిక్ నిపుణులను రంగంలోకి దించినట్లు అధికారులు చెప్పారు. వేటగాళ్లు కావేరి వన్యప్రాణుల అభయారణ్యం చుట్టుపక్కల గ్రామాలకు చెందినవారని వెల్లడించారు. మృతులను గుర్తించేందుకు అటవీ, పోలీసు సిబ్బంది సంయుక్తంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, ఈ ఘటన సంచలనంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి
ఒక గంట సమయం ఇవ్వండి.. : యువతను కోరిన మోదీ
బెంగళూరులో బెంగాల్ యువకుడి అరెస్ట్.. ఉగ్రసంస్థలతో లింకులతో దర్యాప్తు..