ఒక గంట సమయం ఇవ్వండి.. : యువతను కోరిన మోదీ
ABN , Publish Date - Aug 15 , 2026 | 12:59 PM
ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ (PM Modi) యువత లక్ష్యంగా పలు కార్యక్రమాలను ప్రకటించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ సదుపాయాన్ని అందిస్తున్నామని తెలిపారు.
ఢిల్లీ, ఆగస్టు 15: 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ... 'దిమాగీ నక్సల్స్' పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అడవుల్లో ఆయుధాలు పట్టిన నక్సలిజాన్ని విజయవంతంగా నిర్మూలించామని, సాయుధ నక్సల్స్ కనుమరుగైనా.. ‘దిమాగీ నక్సల్స్’ మిగిలి ఉన్నారని ప్రధాని అన్నారు.
'దిమాగీ నక్సల్స్' ఒక అవకాశం కోసం ఎదురుచూస్తున్నారని, సమాజాన్ని తప్పుడు మార్గంలోకి లాగడానికి వారు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారని ప్రధాని మోదీ తెలిపారు. మనం వారిని గుర్తించి.. ఏకాకిని చేయాలని మోదీ సూచించారు. 3,500 మందికి పైగా భద్రతా సిబ్బంది నక్సలిజం పోరాటంలో అమరులయ్యారని, ఇది యుద్ధాల్లో ప్రాణాలు కోల్పోయిన వారికంటే ఎక్కువని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
అలాగే ప్రస్తుతం దేశంలో జరుగుతోన్న జనగణన గురించి ప్రస్తావించారు. దానిలో యువత చురుగ్గా పాల్గొనాలని మోదీ పిలుపునిచ్చారు. ‘నేను అందరినీ ఒక సాయం చేయాలని అడుగుతున్నాను. జనగణన విషయంలో ఒక గంటా, రెండు గంటల సమయం కేటాయించండి. అది దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది. గణన అంటే లెక్కలన్నీ ఒక దగ్గర రాసుకోవడం కాదు. జనాభా లెక్కల సమయంలో మీరు ఇచ్చే వివరాల ఆధారంగానే జాతీయ విధానాలు, పథకాలు రూపుదిద్దుకుంటాయి. దేశ ప్రగతికి ఆ లెక్కలు సూచీగా ఉంటాయి. అందుకే కచ్చితమైన, స్పష్టమైన సమాచారం ఇవ్వడం అత్యంత కీలకం’ అని మోదీ పేర్కొన్నారు.
ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ యువతకు తీపి కబురు చెప్పారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ సదుపాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు. గడిచిన కొన్నేళ్లలో దేశంలో 650కి పైగా కొత్త విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశామని తెలిపారు. జాతీయ విద్యా విధానం ద్వారా విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా భారత్‌లోకి వస్తున్నాయని, మన యువత స్వదేశంలోనే విదేశీ డిగ్రీలు పొందే అవకాశం లభించిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
స్వాతంత్ర్య దినోత్సవం వేళ.. 'బాంధనీ' తలపాగాతో ఆకట్టుకున్న ప్రధాని
ఎర్రకోటలో తొలిసారి పూర్తిగా వందేమాతరం గేయం..