కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతయ్యాయి.. సర్‌పై యూపీ సీఎం సంచలన వ్యాఖ్యలు..
ABN , Publish Date - Oct 31 , 2026 | 04:36 PM
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్ ప్రక్రియ తర్వాత ఓటర్ల జాబితా నుంచి కోట్లాది మంది హిందువుల పేర్లు గల్లంతయ్యాయని ఆయన ఆరోపించారు.
లఖ్‌నవూ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్ ప్రక్రియ తర్వాత ఓటర్ల జాబితా నుంచి కోట్లాది మంది హిందువుల పేర్లు గల్లంతయ్యాయని ఆయన ఆరోపించారు. సుమారు 1.27 కోట్ల మంది హిందువులను ఓటర్ల జాబితా నుంచి తొలగించారని పేర్కొన్నారు. అర్హులైన ఓటర్లందరినీ తిరిగి జాబితాలో చేర్చాల్సిన అవసరం ఉందని సీఎం నొక్కిచెప్పారు. ఈరోజు (శుక్రవారం) బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో యోగి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్ ప్రక్రియ, హిందువుల ఓట్ల తొలగింపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి యోగి మాట్లాడుతూ.. సర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులను హెచ్చరించారు.
ప్రస్తుతం యూపీలో సుమారు 13 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, అయితే వాస్తవానికి ఆ సంఖ్య 16 కోట్లకు పైగా ఉండాలని సీఎం యోగి చెప్పారు. పంచాయతీ ఓటర్ల జాబితాలో పేర్లున్న 66 లక్షల మంది అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాలో లేరని ఆరోపించారు. దీంతో 28 పట్టణ స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో బీజేపీ బలహీన పడే పరిస్థితి నెలకొందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న 55 లక్షల మంది పేర్లు కూడా ఓటర్ల జాబితాలో లేవని విమర్శించారు. అలాగే, 18-19 ఏళ్ల వయసున్న సుమారు 4.5 లక్షల మంది యువత ఓటర్ల జాబితాలో చోటు దక్కించుకోలేదని వెల్లడించారు. గత సర్ ప్రక్రియలో కేవలం నాలుగు లక్షల మందినే కొత్త ఓటర్లుగా చేర్చడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అర్హులైన ఓటర్లందరి పేర్లు జాబితాలో ఉండేలా చూడాలని, ఇందుకోసం బూత్ స్థాయి అధికారులతో సమన్వయం చేసుకోవాలని పార్టీ కార్యకర్తలకు సీఎం సూచించారు.
ఈ అంశంపై క్రమం తప్పకుండా సమీక్షలూ నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా హిందువుల ఓట్లు జాబితాలో ఉండేలా చూడాల్సిన బాధ్యతను ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యవర్గ సభ్యులకు అప్పగించారు. కాగా, సర్ ప్రక్రియ తర్వాత ఉత్తరప్రదేశ్ ఓటర్ల జాబితా నుంచి వివిధ కారణాలతో 2.04 కోట్ల మంది పేర్లను ఎన్నికల అధికారులు తొలగించారు. ఈ తొలగింపులు ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా జరిగాయి. ముఖ్యంగా మహిళా ఓటర్లు తీవ్రంగా ప్రభావితమయ్యారు. అయితే, భారత ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం 84 లక్షలకు పైగా కొత్త ఓటర్ల పేర్లను జాబితాలో చేర్చారు. దీంతో యూపీలో తుది ఓటర్ల సంఖ్య 13,39,84,792కు చేరింది. అయితే, ఓటర్ల జాబితా నుంచి హిందువుల పేర్లు తొలగించారంటూ యోగి ఆదిత్యనాథ్ ఆరోపించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ హిందువుల పేర్లు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడాలని పలుమార్లు బీజేపీ కార్యకర్తలకు ఆయన సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు.. 40 మంది అభ్యర్థులతో ఆప్ తొలి జాబితా..
లండన్ నుంచి రహస్యంగా వచ్చి.. పుణెలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి