రెండేళ్ల తర్వాత యోగి క్యాబినెట్ విస్తరణ.. భూపేంద్ర చౌదరి, మనోజ్ పాండేకు చోటు
ABN , Publish Date - May 10 , 2026 | 05:13 PM
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారంనాడు చేపట్టారు. ఆరుగురు కొత్త మంత్రులను తన క్యాబినెట్‌లోకి తీసుకున్నారు.
లక్నో: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ఆదివారంనాడు చేపట్టారు. ఆరుగురు కొత్త మంత్రులను తన క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. లక్నోలోని జన్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కొత్త మంత్రుల చేత గవర్నర్ అనందిబెన్ పటేల్ ప్రమాణస్వీకారం చేయించారు.

ఉత్తరప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరి, బీజేపీ నేత మనోజ్ కుమార్ పాండేలు యోగి క్యాబినెట్‌లో కొత్తగా చేరారు. మనోజ్ పాండే ఇటీవలే సమాజ్‌వాదీ పార్టీ నుంచి బీజేపీలో చేరారు. కృష్ణ పాశ్వాన్, సురేంద్ర దిలేర్, హన్సరాజ్ విశ్వకర్మ, కైలాష్ సింగ్ రాజ్‌పుత్ సైతం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు అజిత్ సింగ్ పాల్, సోమేంద్ర తోమర్‌లకు పదోన్నతి కల్పించారు. స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులుగా వీరిని నియమించారు.
యోగి 2.0 ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టడం ఇది రెండోసారి. మార్చి 2024లో మొదటిసారి మంత్రివర్గ విస్తరణ జరిపారు. 2027లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తాజాగా మరోసారి మంత్రివర్గ విస్తరణను యోగి ఆదిత్యనాథ్ చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇవి కూడా చదవండి..
తెలంగాణ వికసిస్తే.. దేశం కూడా వికసిస్తుంది: మోదీ
బెంగాల్‌లో తృణమూల్ 'మెల్ట్‌డౌన్'.. మమత, అభిషేక్‌లపై సొంత పార్టీ నేతల తిరుగుబాటు!