యూపీ కోసమే ఎమ్మెల్యేల పరిమితి పెంపు
ABN , Publish Date - Nov 29 , 2026 | 05:30 AM
డీలిమిటేషన్ బిల్లులో భాగంగా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల గరిష్ఠ పరిమితిని 650కి పెంచాలని ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపాదించడానికి కారణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రమేనని స్పష్టమవుతోంది
గరిష్ఠ పరిమితి 650కి పెంచే ప్రతిపాదన అందుకే!
403 నుంచి 605కు చేరనున్న యూపీ అసెంబ్లీ స్థానాలు
న్యూఢిల్లీ, నవంబరు 28: డీలిమిటేషన్ బిల్లులో భాగంగా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల గరిష్ఠ పరిమితిని 650కి పెంచాలని ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపాదించడానికి కారణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రమేనని స్పష్టమవుతోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా ఎమ్మెల్యేల సంఖ్య కనీసం 60కి తక్కువ కాకుండా గరిష్ఠంగా 500 వరకు మాత్రమే ఉండాలన్న నిబంధన ఉంది. ప్రస్తుతం దేశంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 403 శాసనసభ స్థానాలున్నాయి. అయితే నరేంద్రమోదీ సర్కారు తాజాగా తీసుకొస్తున్న డీలిమిటేషన్ బిల్లులో భాగంగా అన్ని రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలనూ 50 శాతం చొప్పున పెంచాలని ప్రతిపాదించారు. దీని ప్రకారం ఉత్తరప్రదేశ్లో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 605కు చేరుతుంది. ఇది ప్రస్తుతం ఉన్న 500 గరిష్ఠ పరిమితిని మించిపోతుండడంతో ఈ పరిమితిని పెంచాల్సిన అనివార్యత ఏర్పడింది. లేదంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్నే విభజించాల్సిన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. త్వరలో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడం, రాష్ట్రాన్ని విభజించేందుకే బీజేపీ డీలిమిటేషన్ బిల్లు తెస్తోందని యూపీలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ ఇప్పటికే ఆరోపిస్తుండడంతో సీట్ల పరిమితిని పెంచడమే ఇందుకు పరిష్కారమని కేంద్రం భావిస్తోంది. కానీ, లోక్సభ స్థానాల పెంపు 2029 ఎన్నికల్లో అమల్లోకి వస్తుందని చెబుతున్న నేపథ్యంలో.. 2027లో జరిగే యూపీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల సంఖ్య పెంపు అమలవుతుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. అయితే డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయంపై ఇది ఆధారపడి ఉంటుందని అంటున్నారు
ఈ వార్తలనూ చదవండి:
అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్ చెక్..