Share News

ఇరాన్‌ యుద్ధనౌకపై అమెరికా దాడి

ABN , Publish Date - Mar 05 , 2026 | 03:21 AM

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా దాడులు.. ఇరాన్‌ ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతున్న వేళ.. మరో కీలక ఘటన చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి ఇరాన్‌ యుద్ధనౌకపై అమెరికా దాడి చేసింది.....

ఇరాన్‌ యుద్ధనౌకపై అమెరికా దాడి

  • శ్రీలంక సమీపంలో జలాంతర్గామితో ఎటాక్‌.. సముద్రంలో మునిగిన నౌక

  • నౌకలోని 140 మందికి పైగా సిబ్బంది గల్లంతు

  • 32 మందిని కాపాడిన శ్రీలంక నౌకాదళం

  • పలువురి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడి

  • విశాఖపట్నంలో నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని తిరిగి ఇరాన్‌కు యుద్ధనౌక వెళ్తుండగా ఘటన

  • తామే దాడి చేశామన్న అమెరికా రక్షణ మంత్రి

  • ఇరాన్‌ రహస్య అణుకేంద్రం ధ్వంసం: ఐడీఎఫ్‌

  • టర్కీపై ఇరాన్‌ బాలిస్టిక్‌ క్షిపణి.. అడ్డుకున్న నాటో

  • లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడి.. 50 మంది మృతి

  • అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్త దాడుల్లో 1045 మంది మృతి.. ఇరాన్‌ వెల్లడి

  • యుద్ధం తొలి 2 రోజుల్లోనే 650 మంది అమెరికా సైనికుల్ని హతమార్చాం: ఐఆర్‌జీసీ

న్యూఢిల్లీ, మార్చి 4: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా దాడులు.. ఇరాన్‌ ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతున్న వేళ.. మరో కీలక ఘటన చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి ఇరాన్‌ యుద్ధనౌకపై అమెరికా దాడి చేసింది. అది కూడా శ్రీలంక తీరం సమీపంలో ఈ దాడి జరిగింది. ఇరాన్‌కు చెందిన ఐఆర్‌ఐఎస్‌ దేనా నౌక.. భారత్‌లోని విశాఖపట్నంలో ఫిబ్రవరి 18 నుంచి 25 వరకు జరిగిన మిలాన్‌ 2026 నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని తిరిగి వెళ్తుండగా.. శ్రీలంక తీరంలో అమెరికా జలాంతర్గామితో దాడికి పాల్పడింది. దీంతో ఇరాన్‌ నౌక సముద్రంలో మునిగిపోయింది. అందులోని 140 మందికిపైగా గల్లంతయ్యారు. 32 మందిని శ్రీలంక నౌకాదళం కాపాడింది. అయితే తొలుత ఇరాన్‌ నౌక ప్రమాదానికి గురైందని భావించారు. ఈ నౌక గాలె తీరానికి 40 నాటికల్‌ మైళ్ల దూరంలో ఉన్నప్పుడు.. ప్రమాదంలో ఉన్నట్లు శ్రీలంక నౌకాదళానికి సమాచారం అందించింది.


దీంతో శ్రీలంక ఎయిర్‌ఫోర్స్‌, నౌకాదళ సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న 32 మందిని కాపాడారు. వారు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని శ్రీలంక నౌకాదళ అధికార ప్రతినిధి బుద్ధిక సంపత్‌ తెలిపారు. ప్రమాదంలో ఎంత మంది చనిపోయారన్నది ఇప్పుడే చెప్పలేమని, ఇప్పటివరకు 87 మృతదేహాలు లభ్యమయ్యాయని పేర్కొన్నారు. కాగా, ఇరాన్‌ నౌక ప్రమాదానికి గురైన విషయాన్ని శ్రీలంక విదేశాంగ మంత్రి విజితా హెరాత్‌.. పార్లమెంటులో ప్రకటించారు. నౌకలో సుమారు 180 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిసిందన్నారు. ప్రమాదానికి కారణమేంటో తెలియాల్సి ఉందన్నారు. అయితే కొన్ని గంటల వ్యవధిలోనే.. ఈ దాడి తామే చేశామని అమెరికా ప్రకటించింది. తమ జలాంతర్గామి నుంచి టోర్పెడోను ప్రయోగించి ఇరాన్‌ యుద్ధనౌకను ముంచివేశామని అమెరికా రక్షణశాఖ మంత్రి పీట్‌ హెగ్సేత్‌ తెలిపారు. అంతేకాదు.. శత్రు దేశానికి చెందిన యుద్ధనౌకపై ఇలాంటి దాడి జరగడం రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు.

ఇరాన్‌ రహస్య అణుకేంద్రం ధ్వంసం..

ఇరాన్‌పై దాడులతో విరుచుకుపడుతున్న అమెరికా, ఇజ్రాయెల్‌.. వరుసగా ఐదోరోజూ ఇరాన్‌ రాజధానితోపాటు ఇతర కీలక నగరాలపై దాడులు కొనసాగించాయి. ఇరాన్‌ నాయకత్వంతోపాటు భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్‌ దాడులు జరిపింది. ఇందుకు ప్రతిగా ఇరాన్‌ కూడా క్షిపణి బ్యారేజ్‌లు, డ్రోన్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. అయితే ఇరాన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన వైఏకే-130 ఫైటర్‌ జెట్‌ను తమ ఎఫ్‌-35 స్టెల్త్‌ ఫైటర్‌ జెట్‌లు కూల్చివేశాయని ఇజ్రాయెల్‌ మిలిటరీ ప్రకటించింది. మరోవైపు ఇరాన్‌ రహస్య అణుకేంద్రాన్ని ధ్వంసం చేశామని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (ఐడీఎఫ్‌) ప్రకటించింది. గతేడాది జూన్‌లో ‘ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌’ పేరిట 12 రోజులపాటు జరిపిన దాడుల కన్నా ఎక్కువగా ఈసారి ఇరాన్‌ అణుకేంద్రంపై బాంబుల వర్షం కురిపించినట్లు పేర్కొంది. క్రితంసారి జరిపిన దాడులతో ఇరాన్‌ తమ అణ్వస్త్ర పరిశోధన కేంద్రాన్ని టెహ్రాన్‌ శివారులో అండర్‌గ్రౌండ్‌లోకి మార్చుకుందని ఐడీఎఫ్‌ అధికార ప్రతినిధి బ్రిగేడియర్‌ జనరల్‌ ఎఫీ డెఫ్రీ తెలిపారు. అయితే తాము దీనిని గుర్తించి తమ ఫైటర్‌ జెట్‌ల ద్వారా 4వేలకు పైగా బాంబులు వేశామని చెప్పారు. ‘మింజాదహీ’ పేరుతో ఏర్పాటు చేసిన ఆ ప్రదేశంలో కొద్దిమంది శాస్త్రవేత్తలు అణ్వాయుధాలకు సంబంధించిన పరిశోధనలు జరుపుతున్నారని డెఫ్రీ పేర్కొన్నారు. ఆ శాస్త్రవేత్తల కార్యకలాపాలపై నిఘా పెట్టడం ద్వారా రహస్య అణుకేంద్రాన్ని కనుగొన్నామని వెల్లడించారు. అంతేకాకుండా.. ఇస్ఫహాన్‌లోని క్షిపణి నిల్వ, ఉత్పత్తి కేంద్రాన్ని కూడా తమ మిలిటరీ ధ్వంసం చేసిందని చెప్పారు.

Updated Date - Mar 05 , 2026 | 03:21 AM