Share News

అజిత్ దోవల్‌కు అమెరికా కోర్టు సమన్లు.. ఢిల్లీలోని మూడు కోర్టులకు విజ్ఞప్తి..

ABN , Publish Date - Nov 19 , 2026 | 12:12 PM

ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ దాఖలు చేసిన సివిల్ దావాలో అజిత్ దోవల్‌తో పాటు మాజీ రా చీఫ్ సామంత్ గోయల్‌కు సమన్లు అందజేసేందుకు అమెరికా కోర్టు, ఢిల్లీలోని మూడు జిల్లా కోర్టుల సహకారం కోరింది.

అజిత్ దోవల్‌కు అమెరికా కోర్టు సమన్లు.. ఢిల్లీలోని మూడు కోర్టులకు విజ్ఞప్తి..
Ajit Doval

ఇంటర్నెట్ డెస్క్: భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు సంబంధించిన కేసులో అమెరికా కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ దాఖలు చేసిన సివిల్ దావాలో అజిత్ దోవల్‌తో పాటు మాజీ రా చీఫ్ సామంత్ గోయల్‌కు సమన్లు అందజేసేందుకు ఢిల్లీలోని మూడు జిల్లా కోర్టుల సహకారం కోరింది. ఈ మేరకు పత్రాలను కొరియర్ ద్వారా ఆయా కోర్టులకు పంపించాలని ఆదేశించింది (US Court Summons to Ajit Doval).


అమెరికాలో నివసిస్తున్న ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ (Gurpatwant Singh Pannun) ఈ కేసును దాఖలు చేశారు. తనను అమెరికా గడ్డపై హత్య చేసేందుకు కుట్ర జరిగిందని, అందులో భారత ప్రభుత్వానికి చెందిన కొందరు అధికారులు పాత్ర పోషించారని ఆయన ఆరోపించారు. ఈ సివిల్ దావాలో భారత ప్రభుత్వం, అజిత్ దోవల్, మాజీ రా చీఫ్ సామంత్ గోయల్‌తో పాటు మరికొందరి పేర్లను ప్రస్తావించారు. అమెరికా కోర్టు గతంలో హెగ్‌ కన్వెన్షన్‌ ద్వారా సమన్లు అందజేయడానికి ప్రయత్నించింది. అయితే ఆ ప్రక్రియ విజయవంతం కాలేదు. దీంతో ప్రత్యామ్నాయ మార్గంలో పత్రాలను అందజేయడానికి అనుమతి కోరుతూ పన్నూన్ కోర్టును ఆశ్రయించారు.


గతంలో అమెరికా పర్యటన సందర్భంగా అజిత్ దోవల్‌కు న్యాయపరమైన పత్రాలు అందజేయడానికి ప్రయత్నించినప్పటికీ భద్రతా సిబ్బంది అడ్డుకున్నారని పన్నూన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు (Pannun Lawsuit). ఇప్పుడు ఢిల్లీలోని కోర్టుల ద్వారా పత్రాలను అందజేసే విధానానికి అమెరికా న్యాయస్థానం అనుమతించింది. ఢిల్లీలోని పటియాలా హౌస్, ద్వారక, తీస్ హజారీ జిల్లా కోర్టులకు అవసరమైన న్యాయపరమైన పత్రాలను పంపించాలని అమెరికా కోర్టు క్లర్క్‌ను ఆదేశించింది.


ఇవి కూడా చదవండి..

2035 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా ఇస్లాం.. క్రైస్తవులను దాటేయనున్న ముస్లిం జనాభా..

గాజాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. హమాస్ ఆధీన ప్రాంతంలోకి ఇజ్రాయెల్ సైన్యం!

Updated Date - Nov 19 , 2026 | 12:32 PM