Share News

సైకిల్‌పై ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను చేరిన తొలి భారతీయ మహిళ.. సరికొత్త రికార్డు!

ABN , Publish Date - Apr 06 , 2026 | 11:47 AM

అచంచలమైన ఆత్మవిశ్వాసం, అంకిత భావం ఉంటే ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చు అని ఒక మహిళ నిరూపించింది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన దివ్య సింగ్.. 14 రోజుల్లో కాఠ్మండు నుంచి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు సైకిల్‌పై ప్రయాణించి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. వివరాల్లోకి వెళితే..

సైకిల్‌పై ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను చేరిన తొలి భారతీయ మహిళ.. సరికొత్త రికార్డు!
Divya Singh Everest Record

ఇంటర్నెట్ డెస్క్: అచంచలమైన ఆత్మవిశ్వాసం, అంకిత భావం ఉంటే ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చు అని ఒక మహిళ నిరూపించింది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన దివ్య సింగ్.. కాఠ్మండు నుంచి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకూ 14 రోజుల్లో సైకిల్‌పై ప్రయాణించి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. దివ్య సింగ్ సాధించిన ఈ స్ఫూర్తిదాయకమైన ఘనతకు యావత్ దేశ ప్రజల నుంచి ప్రశంసలు లభించాయి.


ఉత్తరప్రదేశ్‌కు చెందిన దివ్య సింగ్.. నేపాల్ రాజధాని కాఠ్మండు నుంచి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ (EBC) వరకూ సైకిల్‌పై ప్రయాణించింది. కేవలం 14 రోజుల్లో ఆమె ఈ లక్ష్యాన్ని చేరుకున్నారు. గడ్డకట్టే చలి, నిటారుగా ఉండే భూభాగం, తక్కువ ఆక్సిజన్ స్థాయిలను ఎదుర్కొంటూ.. ఆమె రోజూ గంటల తరబడి సైకిల్ తొక్కారు. సాధారణంగా ట్రెక్కింగ్ చేసేవారికే సవాలుగా నిలిచే ఈ మార్గంలో.. సైకిల్‌ను తొక్కుతూ.. వీలుకాని చోట భుజాన మోస్తూ ఆమె సాగించిన ప్రయాణం.. భారతీయ మహిళా శక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.


ఈ ప్రయాణం దివ్య సింగ్‌కి అంత సాఫీగా ఏమీ సాగలేదు. కొన్ని చోట్ల కొండ చరియలు విరిగిపడి దారులు మూసుకుపోయాయి. అయినా వెనకడుగు వేయకుండా తన సైకిల్‌ను భుజాన వేసుకుని నడుస్తూ ముందుకు సాగింది. అకుంఠిత దీక్ష, అంకితభావంతో చివరకు తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. సుమారు 5,364 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరుకోవడమే చాలా మంది సాహస యాత్రికులకు ఒక సవాలుతో కూడిన యాత్ర. అలాంటిది సైకిల్‌పై ఆ మార్గాన్ని అధిగమించిన దివ్య సింగ్ ప్రతిభను చూసి నెటిజన్లు, సాహస క్రీడాకారులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. భారతీయ మహిళా శక్తిని ప్రపంచ దేశాల ముందు మరోసారి చాటిచెప్పిన ఈమె ప్రయాణం ఎంతో మంది యువతకు స్ఫూర్తినిస్తోంది.


ఇవి కూడా చదవండి..

ఐపీఎల్ 2026: భువనేశ్వర్‌ అరుదైన రికార్డు..

సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాలు.. ముఠా అరెస్ట్

Updated Date - Apr 06 , 2026 | 12:03 PM