Share News

తల్లి రెండో పెళ్లి చేసుకుందని.. కొడుకు ఎంత పని చేశాడంటే..

ABN , Publish Date - Oct 13 , 2026 | 12:31 PM

తల్లి రెండో వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. న్యూజిలాండ్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌కు వచ్చి ఆమె రెండో భర్తను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

తల్లి రెండో పెళ్లి చేసుకుందని.. కొడుకు ఎంత పని చేశాడంటే..
Rampur killing case

ఇంటర్నెట్ డెస్క్: తల్లి రెండో వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. న్యూజిలాండ్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌కు వచ్చి ఆమె రెండో భర్తను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఓ వ్యాపారిపై కాల్పులు జరపడం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న అవ్‌దీప్‌ సింగ్‌తో పాటు అతడి బంధువు రాజదీప్‌ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు (Rampur murder case).


ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ జిల్లా మిలక్‌ ఖానమ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కుమ్హరియా గ్రామంలో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. నవజోత్‌ సింగ్‌ తన దుకాణం వద్ద ఉండగా, ఆల్టో కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ముఖాలకు ముసుగులు ధరించి లోపలికి ప్రవేశించారు. అనంతరం నవజోత్‌పై కాల్పులు జరిపారు. దుండగులను అడ్డుకునేందుకు నవజోత్ ప్రయత్నించినప్పటికీ, పలుమార్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన నవజోత్‌ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి (Uttar Pradesh crime news).


నవజోత్‌ సింగ్‌ తండ్రి నిషాన్‌ సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడి హత్య వెనుక అతడి భార్య కమల్‌ కౌర్‌ కొడుకు పాత్ర ఉందని ఆరోపించారు. కమల్‌ కౌర్‌కు గతంలో వివాహం అయింది. ఆమెకు అవ్‌దీప్‌ సింగ్‌, జోగన్‌ప్రీత్‌ సింగ్‌ అనే కుమారులు ఉన్నారు. వారు ప్రస్తుతం న్యూజిలాండ్‌లో నివసిస్తున్నారు. భర్త మరణించిన తర్వాత నవజోత్‌ను కమల్ వివాహం చేసుకున్నారు. తల్లి రెండో వివాహాన్ని అవ్‌దీప్, జోగన్ వ్యతిరేకించారని, ఈ నేపథ్యంలో కుటుంబంలో విభేదాలు ఏర్పడ్డాయని నిషాన్ చెబుతున్నారు (Mothers second marriage).


అవ్‌దీప్‌ న్యూజిలాండ్‌ నుంచి ఐదు రోజుల క్రితం భారత్‌కు వచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. బంధువు అయిన రాజదీప్‌ సింగ్‌‌తో కలిసి అవదీప్‌ ఈ హత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య జరిగిన సమయంలో నిందితుల కదలికలు, వారు ప్రయాణించిన వాహనం, కాల్పులకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆస్తి, డబ్బుకు సంబంధించిన వివాదాలు కూడా ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని పోలీసులు పరిశీలిస్తున్నారు. అవ్‌దీప్‌ సింగ్‌తో పాటు అతడి బంధువు రాజదీప్‌ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

రోహిత్, కోహ్లీ మాత్రమే కాదు.. 2027 ప్రపంచకప్‌లో అసలైన బలం ఇదే: మహమ్మద్ కైఫ్


ప్రతిపక్ష కూటమి పిటిషన్‌లో 14 లోపాలు.. కోర్టు ఫీజులో రూ.220 తక్కువగా చెల్లింపు..

Updated Date - Oct 13 , 2026 | 12:31 PM