ముగ్గురు అమ్మాయిల ఆత్మహత్య.. డైరీలో సంచలన విషయాలు
ABN , Publish Date - Feb 04 , 2026 | 03:06 PM
ఉత్తరప్రదేశ్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఆన్‌లైన్ కొరియన్ గేమ్ కారణంగా ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి తాజాగా మృతుల గదిలో పోలీసులకు లభించిన డైరీలో కీలక విషయాలు వెల్లడయ్యాయి.
యూపీ, ఫిబ్రవరి 04: ఉత్తరప్రదేశ్(UP sisters Case)లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఆన్‌లైన్ కొరియన్ గేమ్ కారణంగా ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ గేమ్ ఆడవద్దని తల్లిదండ్రులు మందలించటంతో ముగ్గురు అక్కాచెల్లెళ్లు 9వ అంతస్తు నుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకున్నారని వార్తలు వినిపించాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి తాజాగా మృతుల గదిలో పోలీసులకు లభించిన డైరీలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. అలానే ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పిన మాటలు అందరినీ షాక్‌కు గురి చేశాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే...
ఘజియాబాద్‌కు(Ghaziabad Tragedy case) చెందిన 16 ఏళ్ల నిషిక, 14 ఏళ్ల ప్రాచి, 12 ఏళ్ల పఖి.. బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో తాము నివాసం ఉండే భవనంలోని 9వ అంతస్తు నుంచి పడిపోయి మృతిచెందారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ అమ్మాయిలు నివాసం ఉండే గదికి వెళ్లిన పోలీసులుకు ఓ డైరీ లభ్యమైంది. 'సారీ నాన్న.. నన్ను క్షమించండి. డైరీలో రాసినవి అన్నీ చదవండి. ఎందుకంటే.. ఇవి నిజాలు కాబట్టి. ఇప్పుడే చదవండి నాన్న' అని డైరీలో రాసి ఉంది. చివర్లో కన్నీరు పెడుతున్న ఎమోజీ ఉంది. ఆ ముగ్గురిలో ఒకరు గదిలో ఓ గోడపై.. 'నేను చాలా చాలా ఒంటరిగా ఉన్నాను, నా జీవితం చాలా చాలా ఒంటరిగా ఉంది' అని రాశారు. దీంతో ఈ ఘటనలో మరేదో ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
షాకింగ్ నిజాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి:
ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారని అందరూ భావిస్తుంటే.. ఆ ఘటనను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి మాత్రం వేరే విధంగా చెప్పారు. 'ఆ ముగ్గురు అక్కచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకోలేదు. వారిలో ఒకరు మాత్రమే సూసైడ్ కు ప్రయత్నించారని తెలిపారు. వారిలో ఒక అమ్మాయి బాల్కనీ నుంచి దూకేందుకు ప్రయత్నించింది. ఆమెను కాపాడేందుకు మిగిలిన ఇద్దరు ప్రయత్నించారు. ఆమెను కాపాడేందుకు వెనుక పట్టుకునే ప్రయత్నంలో వారూ బాల్కని నుంచి జారి కిందపడ్డారు' అని తెలిపాడు. 'మేము కొరియాను వదల్లేము. కొరియా మా జీవితం. మీరు మమ్మల్ని విడిపించలేరు. మేము మా జీవితాలను ముగించుకుంటున్నాము' అని నోట్‌లో పేర్కొన్నట్లు వారి తండ్రి తెలిపారు. మొత్తంగా కొరియన్ ఆన్‌లైన్ గేమింగ్ యాప్(Online gaming) కారణంగా ఒకరు ఆత్మహత్య చేసుకునే క్రమంలో మిగిలిన ఇద్దరు బలైనట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణం తీసిన కొరియన్ ఆన్‌లైన్ గేమ్
ప్రియురాలి దారుణం.. ప్రియుడు తన ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడని..