భారీ ఉగ్రకుట్ర భగ్నం.. నలుగురు ఉగ్రవాదుల అరెస్టు..
ABN , Publish Date - Apr 04 , 2026 | 04:59 PM
దేశంలో భారీ పేలుళ్ల ఉగ్రకుట్రను ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు భగ్నం చేశారు. పేలుళ్లకు ప్రణాళికలు రచించిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
ఢిల్లీ: దేశంలో భారీ పేలుళ్ల ఉగ్రకుట్రను ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు భగ్నం చేశారు. పేలుళ్లకు ప్రణాళికలు రచించిన నలుగురిని ఉత్తర ప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎస్) అరెస్టు చేసింది. నిందితులకు పాక్ ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలింది. నలుగురు నిందితులను సాకిబ్ అలియాస్ డెవిల్, వికాస్ గెహ్లావత్ అలియాస్ రౌనక్, లోకేశ్ అలియాస్ పాప్లా పండిట్ అలియాస్ బాబు అలియాస్ సంజు, అర్బాబ్‌గా గుర్తించారు. పాకిస్థాన్ హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు వీరంతా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వీరంతా దేశవ్యాప్తంగా పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు నిందితులు టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా పాకిస్థాన్ తీవ్రవాద గ్రూపులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు విచారణలో ఏటీఎస్ పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడు మీరట్‌కు చెందిన సాకిబ్ అలియాస్ డెవిల్ అని తెలిపారు. మిగిలిన ముగ్గురితో కలిసి దేశంలో అతను పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు వెల్లడించారు. ఏప్రిల్ 2న లక్నో రైల్వేస్టేషన్ వద్ద పేలుడుకు కుట్ర పన్నుతుండగా పక్కా సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లి వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
వీరిపై బీఎన్ఎస్(BNS), ఉపా(UAPA) చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి పేలుడు పదార్థాలు, ఏడు స్మార్ట్ ఫోన్లు, 24 కరపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ నిందితులు కొన్ని ప్రదేశాల్లో చిన్నపాటి పేలుళ్లకు పాల్పడ్డారని.. దాన్ని వీడియో తీసి ఉగ్రసంస్థలకు పంపారని పోలీసులు తెలిపారు. దాని ద్వారా ఉగ్రసంస్థల నుంచి నిధులు సేకరించారని పేర్కొన్నారు. వీరంతా సోషల్ మీడియాను ఉపయోగించి యువతను తీవ్రవాదం వైపు ఆకర్షించే ప్రయత్నం చేశారన్నారు.
రైల్వే సిగ్నల్స్, గ్యాస్ సిలిండర్ల ట్రక్కులు, ప్రభుత్వ కీలక ఆస్తులే లక్ష్యంగా దాడికి ప్లాన్ చేసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే వీరంతా రాజకీయ ప్రముఖుల ఇళ్లు, ప్రముఖ సంస్థల వద్ద రెక్కీ నిర్వహించారని.. ఆ సమాచారాన్ని పాకిస్థానీ హ్యాండ్లర్లకు పంపారని తెలిపారు. ఘజియాబాద్, అలీగఢ్, లక్నోతోపాటు ప్రముఖ ప్రదేశాల్లో వీరంతా సర్వే చేశారని పోలీసులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
పుదుచ్చేరి రాష్ట్ర హోదాకు టీవీకే కృషి: విజయ్
ట్రంప్ నియంత్రణలో మోదీ, ఆయన నియంత్రణలో పినరయి... రాహుల్ విసుర్లు