Share News

పనీర్, నెయ్యి సహా అనలాగ్ పాల ఉత్పత్తులపై పూర్తి నిషేధం

ABN , Publish Date - Aug 15 , 2026 | 07:43 PM

ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం కృత్రిమ పన్నీర్, నెయ్యి, కోవా ఉత్పత్తి, విక్రయాలపై సంపూర్ణ నిషేధం విధించింది. మిల్క్ ఫ్యాట్‌కు బదులుగా వెజిటబుల్ ఆయిల్స్, రసాయనాలు ఉపయోగిస్తూ తయారుచేసే ఈ ఉత్పత్తుల విక్రయాలను పూర్తిగా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

పనీర్, నెయ్యి సహా అనలాగ్ పాల ఉత్పత్తులపై పూర్తి నిషేధం
UP Govt Bans Analogue Dairy Products Including Paneer, Ghee and Khoya

లఖ్‌నవూ, ఆగస్టు 15: ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే నకిలీ, కృత్రిమ(Analogue) డైరీ ఉత్పత్తుల తయారీ, విక్రయాలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. మిల్క్ ఫ్యాట్‌కు బదులుగా వెజిటబుల్ ఆయిల్స్, రసాయనాలు ఉపయోగిస్తూ తయారుచేసే 'అనలాగ్' పన్నీర్, నెయ్యి, కోవాల విక్రయాలను రాష్ట్రవ్యాప్తంగా పూర్తిగా నిషేధిస్తూ విజిలెన్స్ అండ్ ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(FSDA) ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు కూడా ఇటువంటి ఉత్పత్తులపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.


ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ప్రకారం పాలు, పాల ఉత్పత్తులను వాటి సహజ రూపంలోనే తయారుచేసి విక్రయించాలి. అయితే, యూపీలోని పలు జిల్లాల్లో నిర్వహించిన తనిఖీల్లో పాల ఉత్పత్తులలో రిఫైన్డ్ ఆయిల్స్, వెజిటబుల్ ఫ్యాట్స్, సోయాబీన్ ఉత్పత్తులతో పాటు టాల్కమ్ పౌడర్, డిటర్జెంట్లు, టైటానియం డయాక్సైడ్, లిక్విడ్ గ్లూకోజ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి హానికర రసాయనాలను కలుపుతున్నట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఇటువంటి నకిలీ ఉత్పత్తులను నిరోధించడం ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ప్రాథమిక బాధ్యత అని ప్రభుత్వం స్పష్టం చేసింది.


ప్రభుత్వ ఉత్తర్వుల్లోని ప్రధానాంశాలు

తక్షణ సీజ్, ధ్వంసం: ఏదైనా ప్రాసెసింగ్ లేదా తయారీ కేంద్రంలో విదేశీ కొవ్వులు (Foreign fats) లేదా హానికర రసాయనాలు లభిస్తే, ఆ యూనిట్‌లోని పాల ఉత్పత్తులన్నింటినీ తక్షణమే సీజ్ చేసి ధ్వంసం చేస్తారు.

ఎమర్జెన్సీ ప్రొహిబిషన్ ఆర్డర్ (Section 34): ప్రజారోగ్య దృష్ట్యా సదరు ప్లాంట్ లేదా సంస్థలో ఉత్పత్తి పనులను తక్షణమే నిలిపివేస్తూ అత్యవసర నిషేధ ఉత్తర్వులు ఇస్తారు.

కఠిన క్రిమినల్ కేసులు (BNS FIR): వ్యవస్థీకృతంగా ప్రమాదకర రసాయనాలను వినియోగిస్తున్నట్లు తేలితే భారతీయ న్యాయ సంహిత (BNS) కింద యజమానులపై ఎఫ్.ఐ.ఆర్ (FIR) నమోదు చేస్తారు.

లైసెన్స్ రద్దు: ఫుడ్ సేఫ్టీ నిబంధనల కింద సంబంధిత సంస్థ ఫుడ్ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తారు.

బ్రాండ్‌పై రాష్ట్రవ్యాప్త నిషేధం: వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యే పాల ఉత్పత్తులలో కూడా ఇటువంటి కల్తీలు ఉన్నట్లు ఆధారాలు లభిస్తే, ఆ నిర్దిష్ట బ్రాండ్‌ విక్రయాలపై రాష్ట్రమంతటా సంపూర్ణ నిషేధం విధిస్తారు.


ఇవి కూడా చదవండి...

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య వేడుకలు.. జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

ఏపీ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. ఊరూవాడా జాతీయ జెండా రెపరెపలు

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 15 , 2026 | 08:53 PM