కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. రూ. 1.52 లక్షల కోట్లతో అభివృద్ధి పథకాలకు గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - May 05 , 2026 | 07:42 PM
దేశాభివృద్ధిని పరుగులు పెట్టించే దిశగా కేంద్ర క్యాబినెట్ ఇవాళ సంచలన నిర్ణయాలు తీసుకుంది. పలు కీలక ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలకు ఆమోదం తెలుపుతూ దాదాపు రూ. 1,52,702 కోట్ల నిధులు మంజూరు చేసింది. మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, సెమీకండక్టర్, తదితర రంగాలకు ఈ నిధులను కేటాయించారు.
న్యూఢిల్లీ, మే 5: దేశాభివృద్ధిని పరుగులు పెట్టించే దిశగా కేంద్ర క్యాబినెట్ ఇవాళ సంచలన నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో పలు కీలక ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలకు ఆమోదం తెలుపుతూ దాదాపు రూ. 1,52,702 కోట్ల నిధులను మంజూరు చేసింది. మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, సెమీకండక్టర్ రంగాలకు ఈ నిధులను కేటాయించారు.
వ్యవసాయ రంగానికి పెద్దపీట
రైతుల సంక్షేమమే ధ్యేయంగా కేంద్రం భారీ కేటాయింపులు చేసింది. చెరుకు రైతులకు తీపి కబురు అందించింది. 2026-27 సంవత్సరానికి గాను చెరుకు 'ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్' (FRP) కోసం ఏకంగా రూ. 1 లక్ష కోట్లను కేటాయించింది. కాటన్ మిషన్.. పత్తి ఉత్పాదకతను పెంచేందుకు 'మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ' కింద రూ. 5,659 కోట్లు మంజూరు చేసింది.
సెమీకండక్టర్ హబ్‌గా భారత్
టెక్నాలజీ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు సెమీకండక్టర్ యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు ప్రకటించింది. క్రిస్టల్ మ్యాట్రిక్స్ లిమిటెడ్.. సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటు కోసం ఈ సంస్థకు రూ. 3,068 కోట్లు కేటాయించారు. సుచి సెమికాన్ ప్రైవేట్ లిమిటెడ్.. మరో యూనిట్ కోసం రూ. 868 కోట్లు మంజూరు చేశారు.
రైల్వే కనెక్టివిటీ విస్తరణ
రైల్వే నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు మూడు కీలక మార్గాల్లో 3వ, 4వ లైన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. నగద - మథుర రైల్వే లైన్ నిర్మాణానికి రూ. 16,403 కోట్లు, గుంతకల్ - వాడి లైన్ నిర్మాణానికి రూ. 4,758 కోట్లు కేటాయించారు. ఇది తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఎంతో మేలు చేకూరుస్తుంది. బుర్హవాల్ - సీతాపూర్ రైల్వే లైన్‌కు రూ. 2,276 కోట్లు కేటాయించారు. వీటితోపాటు మరికొన్ని ఇతర కీలక నిర్ణయాలను కేంద్ర క్యాబినెట్ తీసుకుంది.
MSMEలకు మద్దతునిచ్చేలా ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ (ECLGS) కోసం రూ. 18,100 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. షిప్పింగ్ రంగం.. వడినర్‌లో ఓడల మరమ్మత్తుల (Ship Repair) సౌకర్యాల అభివృద్ధికి రూ. 1,570 కోట్లు కేటాయించారు. సుప్రీంకోర్టు బలోపేతం.. అత్యున్నత న్యాయస్థానం పనితీరును మరింత మెరుగుపరచడానికి, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ఒక కీలక విధాన నిర్ణయాన్ని క్యాబినెట్ ఆమోదించింది. దీంతోపాటు, సుప్రీంకోర్టులో మరో నలుగురు న్యాయమూర్తులను పెంచడానికి కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో దేశ అత్యున్నత న్యాయస్థానంలో జడ్జిల సంఖ్య 33 నుంచి 37కు చేరుతుంది. ఈ భారీ కేటాయింపులు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా, భారీగా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తాయని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పాలి: టీపీసీసీ చీఫ్
తెలంగాణ బాగుపడాలంటే ఏకైక మార్గం.. : ఎంపీ ఈటల