Share News

వాళ్లు బొద్దింకల్లా వ్యవస్థపై దాడి చేస్తున్నారు.. సీజేఐ అసహనం

ABN , Publish Date - May 15 , 2026 | 07:21 PM

కొంతమంది నిరుద్యోగ యువతను బొద్దింకలతో సీజేఐ సూర్యకాంత్ పోల్చారు. వాళ్లు మీడియా, సామాజిక మాధ్యమం, ఆర్టీఐ కార్యకర్తల్లా మారి వ్యవస్థపై దాడి చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు.

వాళ్లు బొద్దింకల్లా వ్యవస్థపై దాడి చేస్తున్నారు.. సీజేఐ అసహనం
CJI Surya kant

న్యూఢిల్లీ: కొంతమంది నిరుద్యోగ యువతను బొద్దింకలతో (cockroaches) సీజేఐ సూర్యకాంత్ (Surya Kant) పోల్చారు. వాళ్లు మీడియా, సామాజిక మాధ్యమం, ఆర్టీఐ కార్యకర్తల్లా మారి వ్యవస్థపై దాడి చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. సీనియర్ న్యాయవాది హోదాను కోరుతున్న ఒక న్యాయవాదిని సీజేఐ మందలిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థపై దాడి చేస్తున్న పరాన్నజీవులు సమాజంలో ఉన్నారని, వారితో చేతులు కలపాలనుకుంటున్నారా అని పిటిషనర్‌ను (న్యాయవాది) నిలదీశారు.


సీనియర్ అడ్వకేట్‌ల హోదాకు సంబంధించిన మార్గదర్శకాలపై జాప్యం జరుగుతున్నందున ఢిల్లీ హైకోర్టుకు అదేశాలివ్వాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు. దీనిపై విచారణకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. 'సీనియర్ అడ్వకేట్ హోదా అనేది కోర్టు ప్రసాదించే విశిష్ట గౌరవం. పిటిషన్లతో వాటిని సాధించుకోలేరు' అని సీజైఐ అన్నారు. ఫేస్‌బుక్‌లో పిటిషనర్ వాడిన భాష, పోస్టులు తాము గమనిస్తున్నామని పేర్కొన్నారు. వ్యవస్థపై దాడి చేస్తున్న కొందరు పరాన్నజీవులతో మీరు చేతులు కలపాలనుకుంటున్నారా అని పిటిషనర్‍‌ను సూటిగా ప్రశ్నించారు. 'సీనియర్ హోదాను మీకు తప్ప ప్రపంచంలో ఎవరికైనా ఇవ్వవచ్చు. హైకోర్టు మీకు ఆ హోదా ఇచ్చినా మీ ప్రవర్తన చూసి మేము దానిని పక్కనపెడతాం' అని స్పష్టం చేశారు.


కొందరి లా డిగ్రీల ప్రామాణికతపై కూడా తమకు అనుమానాలున్నాయని, దీనిపై సీబీఐ విచారణకు తగిన కేసు కోసం చూస్తున్నామని కూడా సీజేఐ పేర్కొన్నారు. దీనిపై ఓట్లు మాత్రమే కోరుకునే బార్ కౌన్సిల్ కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. సీజేఐ వ్యాఖ్యలతో పిటిషనర్ క్షమాపణ చెప్పుకుంటూ పిటిషన్‌ను వెనక్కి తీసుకునేందుకు అనుమతి కోరారు. అందుకు కోర్టు అనుమతించింది.


ఇవి కూడా చదవండి..

నీట్ విద్యార్థులది వ్యవస్థ చేసిన హత్య.. మోదీ ప్రభుత్వంపై రాహుల్ ధ్వజం

ఆర్జీ కర్ హత్యాచారం కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్

Updated Date - May 15 , 2026 | 07:25 PM