ఆ మూడూ కలిసొస్తే విజయ్‌కు పట్టం.. కొనసాగుతున్న ప్రతిష్టంభన
ABN , Publish Date - May 08 , 2026 | 03:27 PM
టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం కూడగట్టుకోవాలంటే వామపక్షాలు, వీసీకే మద్దతు అనివార్యమవుతోంది. సీపీఐ, సీపీఎంతో పాటు వీసీకే కీలక సమావేశాలు జరుపుతున్నందున సాయంత్రానికి కల్లా అనిశ్చితి తొలిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
చెన్నై: తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏకైక పెద్ద పార్టీగా విజయ్ సారథ్యంలోని టీవీకే నిలిచినప్పటికీ మెజారిటీకి ఆమడ దూరంలో నిలిచిపోయింది. టీవీకే సంఖ్యాబలం చూపిస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తామని గవర్నర్ తేల్చిచెప్పడంతో గత నాలుగు రోజులుగా అనిశ్చితి కొనసాగుతోంది. ఈనెల 10వ తేదీ వరకూ వరకూ టీవీకేకు గవర్నర్ గడువు ఇచ్చినందున అంతవరకూ వేచిచూస్తామని స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే చెబుతోంది. అన్నాడీఎంకే సైతం ప్రభుత్వం ఏర్పాటు దిశగా పావులు కదుపుతోంది. పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలను పుదుచ్చేరిలోని రిసార్ట్‌కు తరలించింది. ఈ నేపథ్యంలో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం కూడగట్టుకోవాలంటే వామపక్షాలు, వీసీకే మద్దతు అనివార్యమవుతోంది. సీపీఐ, సీపీఎంతో పాటు వీసీకే కీలక సమావేశాలు జరుపుతున్నందున సాయంత్రానికి కల్లా అనిశ్చితి తొలిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
టీవీకేకు అనుకూలంగా ప్రజాతీర్పు ఉన్నందున దూకుడుగా వ్యవహరించకుండా వేచిచూడాలని డీఎంకే ఆలోచనగా ఉంది. వీసీకే బలంపరంగా చూస్తే ఆ పార్టీకి విజయ్ గెలిచిన రెండు నియోజకవర్గాలతో సహా 108 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ప్రకటించడంతో ఆ బలం 113కు చేరింది. టీవీకే బలనిరూపణకు మరో ఆరు సీట్లు అవసరం. టీవీకే భవితత్వాన్ని నిర్దేశించే బలం వీసీకే, సీపీఐ, సీపీఎం చేతుల్లో ఉంది. వీసీకే-2, సీపీఐ-2, సీపీఎం-2 సీట్లు గెలుచుకున్నాయి. ఈ పార్టీలు టీవీకేతో జతకడితే సింపుల్ మెజారిటీతో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు సాధ్యమవుతోంది.
టీవీకేతో పొత్తు ఖరారు చేయాలా వద్దా అనే దానిపై వీసీకే, వామపక్ష పార్టీలు శుక్రవారం సాయంత్రానికల్లా ఒక నిర్ణయం తీసుకోనున్నాయి. ప్రజా తీర్పును గౌరవించాలని మూడు పార్టీలు భావిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే డీఎంకేతో వామపక్షాలు, వీసీకే చిరకాలంగా పొత్తు కొనసాగిస్తున్నందున అవి ఎటూతేల్చుకోలేక పోతున్నాయి. మరోవైపు, త్వరలోనే మంచివార్త చెబుతామని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి తాజాగా ప్రకటించడం సంచలనమవుతోంది. అన్నాడీఎంకే, డీఎంకే పొత్తు పొట్టుకుంటాయనే ప్రచారం జరుగుతోంది. అయితే, బీజేపీతో పొత్తు తెంచుకుంటేనే అన్నాడీఎంకేకు మద్దతిచ్చే విషయం ఆలోచిస్తామని డీఎంకే వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలో టీవీకేకు వీసీకే, వామపక్షాలు మద్దతు ప్రకటిస్తాయా లేదా అనే దానిపై తమిళనాట ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి..
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు ఆటంకాలు.. విజయ్ మిస్టేక్ ఇదేనా?
టీవీకేకి మద్దతుపై వామపక్షాలు, వీసీకే చర్చిస్తున్నాయ్.. త్వరలోనే సరైన నిర్ణయం: బినోయ్ విశ్వం