తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు ఆటంకాలు.. విజయ్ మిస్టేక్ ఇదేనా?
ABN , Publish Date - May 08 , 2026 | 02:00 PM
తమిళనాడు గవర్నర్‌కు టీవీకే అధినేత విజయ్ రాసిన లేఖతో పరిస్థితి సంక్లిష్టంగా మారినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలను కూడా లేఖలో చేర్చడంతో పరిస్థితి సందిగ్ధంగా మారినట్టు విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాట తన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో అసాధారణ విజయాన్ని అందుకున్న టీవీకే అధినేత విజయ్‌కు ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం ఊహించని చిక్కులు ఎదురవుతున్నాయి. సంఖ్యాబలం నిరూపించుకోవాలని తమిళనాడు గవర్నర్ ఆర్లేకర్ స్పష్టం చేయడంతో టీవీకే పార్టీ చిక్కుల్లో పడింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, గవర్నర్‌కు టీవీకే పార్టీ అధినేత ఇచ్చిన లేఖతోనే పరిస్థితి కొత్త మలుపు తిరిగింది.
ఆనవాయితీ ప్రకారం, ఎన్నికల తరువాత అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేను గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి. అనంతరం అసెంబ్లీలో టీవీకే తన సంఖ్యాబలాన్ని నిరూపించుకోవాలి. ఈ ఎన్నికల్లో టీవీకేకు 108 సీట్లు వచ్చాయి. విజయ్ రెండు సీట్లలో పోటీ చేసి విజయం సాధించడంతో ఒక స్థానానికి రాజీనామా చేయకతప్పదు. అంటే, టీవీకే వాస్తవ బలం ప్రస్తుతానికి 107 సీట్లే. దీంతో, మ్యాజిక్ ఫీగర్‌ను (118) చేరుకునేందుకు టీవీకేకు మరో 11 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కాంగ్రెస్‌కు ఉన్న ఐదుగురు ఎమ్మెల్యేలను కూడా కలుపుకుంటే టీవీకే కూటమి బలం 112కు చేరుతుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఏర్పాటు కోసం విజయ్ గవర్నర్‌కు లేఖను అందించారు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, మే 6న గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌కు టీవీకే అధినేత ఇచ్చిన లేఖలో ఆయన పార్టీ ఎమ్మెల్యేల సంతకాలతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకు బదులు విజయ్ కేవలం తన పార్టీ ఎమ్మెల్యేల సంతకాలతో లేఖ సమర్పించి ఉంటే అతిపెద్ద పార్టీకి అధిపతిగా ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు తన హక్కును వినియోగించుకునే అవకాశం ఉండేదని అంటున్నారు. కానీ లేఖలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలు కూడా ఉండటంతో కూటమిగా ప్రభుత్వ ఏర్పాటు కోసం విజయ్ ముందుకు వచ్చినట్టైందని సమాచారం. దీంతో, మ్యాజిక్ ఫిగర్ అయిన118 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలని గవర్నర్ కోరినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఈ వార్తలనూ చదవండి:
పొత్తు నుంచి బయటకు రావడం సరైనదే.. ద్రోహి ఎవరు?: ఎంపీ మాణికం ఠాగూర్
అన్నాడీఎంకేతో డీఎంకే పొత్తు.. కనిమొళి ఏమన్నారంటే..