అన్నాడీఎంకేతో డీఎంకే పొత్తు.. కనిమొళి ఏమన్నారంటే..
ABN , Publish Date - May 08 , 2026 | 01:19 PM
డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల అగ్రనేతలు దశాబ్దాల వైరాన్ని మరిచి పొత్తులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై డీఎంకే ఎంపీ కనిమొళి స్పందించారు.
చెన్నై, మే 8: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు సాధించినా.. మెజార్టీ లేకపోవటంతో టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతోంది. దీన్ని డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు అవకాశంగా మలుచుకోవాలని చూస్తున్నాయి. ఇరు పార్టీల అగ్రనేతలు దశాబ్దాల వైరాన్ని మరిచి పొత్తులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై డీఎంకే ఎంపీ కనిమొళి స్పందించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతించాలి. ప్రజల తీర్పే సర్వోన్నతమైనది. దానిని గౌరవించాలి. దురదృష్టవశాత్తు ఎవరికీ మెజారిటీ లేదు. నేను ఊహాగానాలకు సమాధానం ఇవ్వలేను’ అని అన్నారు.
రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ.. టీవీకేకు మద్దతు ఇవ్వటంపై కనిమొళి స్పందించారు. మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కనిమొళి మాట్లాడుతూ.. కాంగ్రెస్-డీఎంకే చాలా ఎన్నికల్లో కలిసి పనిచేశాయని తెలిపారు. తాజా ఎన్నికల్లో కూడా కలిసి పోటీచేసి ఓటమి చవిచూశాయన్నారు. ప్రతి పార్టీకి తమకు ఏదైతే సరైనదని అనిపిస్తుందో అది చేసే హక్కు ఉంటుందన్నారు. ఇతరుల గురించి తాను చెప్పేది ఏమీ లేదని, తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
అన్నాడీఎంకేకు మద్దతు.. మెలిక పెట్టిన డీఎంకే..
విశ్వసనీయ వర్గాల సమచారం ప్రకారం.. అన్నాడీఎంకే పార్టీకి మద్దతు ఇవ్వడానికి డీఎంకే సిద్ధంగా ఉంది. మద్దతు కావాలంటే బీజేపీతో అన్నాడీఎంకే పొత్తును రద్దు చేసుకోవాలని డీఎంకే షరతు పెట్టింది. అంతేకాదు.. తమతో పాటు కలిసే చిన్న పార్టీలకు కూడా మంత్రి పదవులు ఇవ్వాలని అంటోంది.
ఇవి కూడా చదవండి
సింగపూర్ మోడల్‌లో ఫిర్యాదుల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ప్లాన్
టెక్నాలజీ ఇంటిగ్రేషన్ జరిగితే పాలన సులభతరం: సీఎం చంద్రబాబు