Share News

టోల్‌ప్లాజాల దగ్గర నివసించే వారికి కేంద్రం గుడ్‌న్యూస్.. వార్షిక పాస్‌లపై భారీ రాయితీ

ABN , Publish Date - Oct 30 , 2026 | 11:50 AM

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ముఖ్యంగా టోల్‌ప్లాజాల సమీపంలో నివసించే స్థానికులకు టోల్ ఛార్జీల భారం తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.

టోల్‌ప్లాజాల దగ్గర నివసించే వారికి కేంద్రం గుడ్‌న్యూస్.. వార్షిక పాస్‌లపై భారీ రాయితీ
FASTag Annual Pass

ఢిల్లీ, అక్టోబర్ 30: జాతీయ రహదారులపై ప్రయాణించే స్థానిక వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. టోల్‌ప్లాజాలకు సమీపంలో నివసించే ప్రజలు తరచూ టోల్ ఛార్జీలు చెల్లించాల్సిన ఇబ్బందులను తగ్గించేందుకు ప్రత్యేక వార్షిక పాస్‌ల విధానాన్ని తీసుకొచ్చింది. టోల్‌ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే వారికి ఈ పాస్‌లు అందుబాటులో ఉంటాయి.

ఈ వెసులుబాటు వాణిజ్యేతర అవసరాల కోసం వినియోగించే, ఫాస్టాగ్‌ కలిగిన వ్యక్తిగత వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. కొత్త నిబంధనలు 2026 నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. టోల్‌ప్లాజా మున్సిపాలిటీ లేదా స్థానిక పట్టణ ప్రాంత పరిధికి వెలుపల ఉంటే వార్షిక పాస్ ధర రూ.1,500గా నిర్ణయించారు. అదే టోల్‌ప్లాజా మున్సిపాలిటీ లేదా స్థానిక పట్టణ ప్రాంత పరిధిలో ఉంటే వార్షిక పాస్ కోసం రూ.3,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. స్థానికులు ప్రతిరోజూ తమ ప్రాంతాల్లోని టోల్‌ప్లాజాలను దాటాల్సి వచ్చినప్పుడు ఎదురవుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం.


ఈ వార్షిక పాస్‌ల ధరలను ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం సవరించనుంది. అంటే ప్రస్తుతం నిర్ణయించిన రూ.1,500, రూ.3,000 ధరలు భవిష్యత్తులో మారే అవకాశం ఉంటుంది. అయితే.. ఈ పాస్‌ల వినియోగానికి సంబంధించి కేంద్రం కొన్ని మినహాయింపులను కూడా స్పష్టం చేసింది. క్లోజ్డ్ యూజర్ ఫీ కలెక్షన్ సిస్టమ్ అమల్లో ఉన్న మార్గాల్లో.. ప్రత్యామ్నాయ సర్వీస్ రోడ్లు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఈ పాస్‌లు వర్తించవు.

టోల్‌ప్లాజాల సమీపంలో నివసించే ప్రజలు స్థానిక అవసరాల కోసం తరచూ ప్రయాణించేటప్పుడు ప్రతిసారీ టోల్ ఫీజు చెల్లించాల్సిన పరిస్థితిని నివారించేందుకు ఈ విధానం ఉపయోగపడనుంది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా అర్హులైన స్థానిక వాహనదారులకు ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా టోల్‌ప్లాజాల పరిసర ప్రాంతాల్లో నివసిస్తూ నిత్యం రాకపోకలు సాగించే ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర వ్యక్తిగత వాహనదారులకు ఆర్థికంగా కొంత ఊరట లభించనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

‘భోగాపురం’ కాదు.. విశాఖపట్నం ఎయిర్‌పోర్టే!

మణ్ణారశాలలో నేటి నుంచి ఆయిల్యా ఉత్సవాలు

For More AP News And Telugu News

Updated Date - Oct 30 , 2026 | 12:34 PM