టీఎంసీ, మమతా బెనర్జీకి షాక్.. రాజీమానా చేసిన ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ..
ABN , Publish Date - Jul 16 , 2026 | 03:53 PM
తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కి, ఆ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి రాజ్యసభ ఎంపీ రుక్మిణి మల్లిక్ (కోయెల్ మల్లిక్) షాక్ ఇచ్చారు. టీఎంసీకి, రాజ్యసభ సభ్యత్వానికి రుక్మిణి మల్లిక్ ఇవాళ (గురువారం) రాజీనామా చేశారు.
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కి, ఆ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీకి రాజ్యసభ ఎంపీ రుక్మిణి మల్లిక్ (కోయెల్ మల్లిక్) షాక్ ఇచ్చారు. టీఎంసీకి, రాజ్యసభ సభ్యత్వానికి రుక్మిణి మల్లిక్ ఇవాళ (గురువారం) రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్‌కు ఆమె సమర్పించారు. దీంతో రాజ్యసభ నుంచి వైదొలిగిన నాలుగో టీఎంసీ ఎంపీగా రుక్మిణి నిలిచారు. ఇప్పటికే ఆ పార్టీ నుంచి సుఖేందు శేఖర్ రాయ్, ప్రకాశ్ చిక్ బరైక్, సుష్మితా దేబ్ తమతమ రాజ్యసభ ఎంపీ పదవులకు రాజీనామా చేశారు.
ఈ ఏడాది ఆరంభంలోనే రాజ్యసభకు రుక్మిణి మల్లిక్ ఎన్నికయ్యారు. టీఎంసీ 2026 ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలకు ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది. దీంతో ఏకగ్రీవంగా ఎన్నికై ఏప్రిల్ 6న రాజ్యసభ ఎంపీగా రుక్మిణి ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికైన వెంటనే టీఎంసీ, మమతా బెనర్జీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. బెంగాల్ ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది ఓ కొత్త ప్రయాణానికి ఆరంభమని, ఉత్తమంగా పని చేసేందుకు ప్రయత్నిస్తానని రుక్మిణి చెప్పుకొచ్చారు. అయితే ఎంపీగా ఎన్నికై నాలుగు నెలలు గడవక ముందే తన పదవికి ఆమె రాజీనామా చేయడం సంచలనంగా మారింది. కాగా, రుక్మిణి మల్లిక్ రాజీనామాపై టీఎంసీ, మమతా బెనర్జీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.
ఎవరీ రుక్మిణి మల్లిక్..?
రుక్మిణి మల్లిక్.. కోయెల్ మల్లిక్ పేరుతో బెంగాలీ చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి నటి. టాలీ-క్వీన్‌గా ప్రసిద్ధి చెందిన రుక్మిణి రెండు దశాబ్దాలకు పైగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. 'నాటర్ గురు', 'శుభోదృష్టి', 'మోన్ మానే నా', 'ప్రేమేర్ కహానీ', '100% లవ్', 'రంగబాజ్' వంటి వరుస హిట్ చిత్రాల్లో ఆమె నటించి మెప్పించారు. రుక్మిణి నటనకు గానూ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ బంగ్లా, రెండు బీఎఫ్‌జేఏ అవార్డులు, ఆనందలోక్ పురస్కార్ వంటి అనేక గౌరవాలను అందుకున్నారు. 2023లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆమెకు మహానాయక్ సమ్మాన్‌ను కూడా ప్రదానం చేసింది. అనంతరం టీఎంసీ పార్టీ ఆమెను రాజ్యసభకు నామినేట్ చేసింది.
వార్తలు కూడా చదవండి...
భూమి కోసం 35 ఏళ్ల పాటు పోరాటం చేసిన వృద్ధురాలు.. చివరికి..
తుది దశకు అహ్మదాబాద్ విమాన ప్రమాద దర్యాప్తు: కేంద్రమంత్రి