భూమి కోసం 35 ఏళ్ల పాటు పోరాటం చేసిన వృద్ధురాలు.. చివరికి..
ABN , Publish Date - Jul 16 , 2026 | 03:04 PM
ఓ 103 ఏళ్ల వృద్ధురాలు కోర్టులో కేసు గెలవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అందులో వింతేముంది అనుకుంటున్నారా? దాదాపు 35 ఏళ్లపాటు పోరాటం చేసి ఆమె ఈ కేసులో విజయం సాధించారు. ఈ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది.
బిహార్: భారతదేశంలో ఏదైనా కేసు కోర్టుకు వెళ్లిందంటే తుది తీర్పు ఎప్పుడు వస్తుందా? అని ఏళ్ల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఒక్కోసారి కేసు పెట్టుకున్న ఇరువర్గాల వారు మృతిచెందేంత వరకు ఆ కేసు పరిష్కారం కాదు. చివరికి ఇద్దరూ చనిపోవడంతో కేసులు కొట్టివేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. చాలా కేసులు దశాబ్దాల పాటు కొనసాగుతూ ఇరు వర్గాల వారిని వాయిదాల పేరుతో తిప్పుతూనే ఉంటాయి. దీనికి కేసుల సంఖ్య, కోర్టుల్లో సిబ్బంది కొరత వంటి అనేక కారణాలు ఉండొచ్చు. అయితే తాజాగా ఓ 103 ఏళ్ల వృద్ధురాలు కోర్టులో కేసు గెలవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అందులో వింతేముంది అనుకుంటున్నారా? దాదాపు 35 ఏళ్లపాటు పోరాటం చేసి ఆమె ఈ కేసులో విజయం సాధించారు. ఈ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది.
తూర్పు చంపారణ్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన హబీబన్ ఖాతూన్ (103)కు సుమారు 1,600 చదరపు అడుగుల స్థలం ఉంది. అయితే ఆ భూమిపై 1994 నుంచి వివాదం కొనసాగుతోంది. ప్రత్యర్థులు ఆ స్థలాన్ని తమదంటూ వాదించారు. దీంతో ఇరు వర్గాలు 1994లో సివిల్ కోర్టును ఆశ్రయించాయి. అప్పటి నుంచి ఈ కేసుపై విచారణ కొనసాగుతూనే ఉంది. ఇరు వర్గాల సుదీర్ఘ వాదనలు పరిశీలించిన న్యాయస్థానం.. హబీబన్ ఖాతూన్‌కే ఆ భూమి చెందుతుందని తాజాగా తీర్పునిచ్చింది. వెంటనే దాన్ని ఆ వృద్ధురాలికి అప్పగించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ, స్థానిక పరిపాలన, పోలీసు శాఖ అధికారులు సంయుక్తంగా గ్రామానికి చేరుకుని హబీబన్ ఖాతూన్‌కు భూమిని అప్పగించారు. ఈ సందర్భంగా గ్రామంలో డప్పులు మోగిస్తూ కోర్టు తీర్పును బహిరంగంగా ప్రకటించారు.
భూ వివాదం సున్నితమైన అంశం కావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గ్రామంలో దాదాపు 300 మంది పోలీసులు మోహరించారు. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లు, రెవెన్యూ అధికారులు, కల్యాణ్‌పూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తం ప్రక్రియను పర్యవేక్షించారు. ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా భూమి అప్పగింత పూర్తయింది. భూమిని స్వాధీనం చేసుకున్న అనంతరం హబీబన్ ఖాతూన్ కుటుంబ సభ్యులు న్యాయవ్యవస్థకు, జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. దశాబ్దాలుగా సాగిన పోరాటానికి చివరకు న్యాయం జరిగిందని.. సహనం, న్యాయవ్యవస్థపై నమ్మకమే తమకు విజయాన్ని అందించిందని పేర్కొన్నారు. కాగా, 35 ఏళ్ల పాటు చెక్కు చెదరని సంకల్పంతో న్యాయం కోసం పోరాడిన ఆ వృద్ధురాలిపై గ్రామస్థులు ప్రశంసలు కురిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
తుది దశకు అహ్మదాబాద్ విమాన ప్రమాద దర్యాప్తు: కేంద్రమంత్రి
ఆస్తి వేలం వివాదం కేసు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన బండ్ల గణేశ్