నీట్ యూజీ 2026 లీక్ కేసు.. 136 ప్రశ్నల్లో 111 ప్రశ్నలు ఎన్‌టీఏ మాస్టర్ పేపర్‌తో మ్యాచింగ్
ABN , Publish Date - Jul 16 , 2026 | 11:38 AM
నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ కేసులో సీబీఐ ఢిల్లీ కోర్టుకు కీలక వివరాలు వెల్లడించింది. లాతూర్‌కు చెందిన ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడి మొబైల్‌లో 136 చేతిరాత ప్రశ్నల్లో 111 ప్రశ్నలు ఎన్‌టీఏ రూపొందించిన మాస్టర్ క్వశ్చన్ పేపర్లోని ప్రశ్నలతో సరిపోలినట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్ : నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ కేసులో సీబీఐ ఢిల్లీ కోర్టుకు కీలక వివరాలు వెల్లడించింది. మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు శివరాజ్ మోటెగావ్‌కర్ మొబైల్ ఫోన్‌లో 136 చేతిరాత ప్రశ్నల్లో 111 ప్రశ్నలు ఎన్‌టీఏ రూపొందించిన క్వశ్చన్ పేపర్ సెట్‌తో సరిపోలినట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది.
లాతూర్‌లో రేణుకై కెమిస్ట్రీ క్లాసెస్ నిర్వహిస్తున్న శివరాజ్ మోటెగావ్‌కర్, 'మోటెగావ్‌కర్ సర్‌స్ ఆర్‌సీసీ' పేరుతో సుమారు 1.68 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్న యూట్యూబ్ ఛానెల్‌ను కూడా నిర్వహిస్తున్నాడు. అతను ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను సీబీఐ పరిశీలించగా, అందులో కెమిస్ట్రీకి సంబంధించిన 132 చేతిరాత ప్రశ్నలు ఉన్న 36 ఫొటోలు లభించాయి. వాటిలో ఐదు ఫొటోలు ఒకే విధంగా ఉండగా, మిగిలిన ఫొటోల్లో ఉన్న చేతిరాత ప్రశ్నలు శివరాజ్ మోటెగావ్‌కర్ రాసినవేనని సీబీఐ భావిస్తోంది.
సీబీఐ దర్యాప్తు ప్రకారం.. మే 3న జరిగిన నీట్-యూజీ 2026 పరీక్షకు దాదాపు 10 రోజుల ముందే, అంటే ఏప్రిల్ 23న శివరాజ్ మోటెగావ్‌కర్‌కు లీకైన ప్రశ్నలు అందినట్లు తెలుస్తోంది. లాతూర్‌కు చెందిన డాక్టర్ మనోజ్ శిరూరే, మాజీ ఎన్‌టీఏ ప్యానెల్ సభ్యుడు, రిటైర్డ్ కెమిస్ట్రీ లెక్చరర్ పీవీ కులకర్ణి ద్వారా ఈ ప్రశ్నలు మోటెగావ్‌కర్‌కు చేరినట్లు సీబీఐ తెలిపింది. ఇందుకోసం రూ.5 లక్షలు చెల్లించినట్లు కూడా ఆరోపించింది. ఈ కేసులో ఇప్పటికే మోటెగావ్‌కర్‌ను అరెస్టు చేసిన సీబీఐ, అతని బెయిల్‌ను వ్యతిరేకిస్తూ ఢిల్లీ కోర్టుకు సమర్పించిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది.
అలాగే, లీకైన ప్రశ్నపత్రం పీడీఎఫ్ కాపీలను టెలిగ్రామ్ ద్వారా రూ.10 లక్షలకు విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పరీక్షకు కొన్ని వారాల ముందే 410 ప్రశ్నలతో కూడిన 150 పేజీల 'అంచనా ప్రశ్నపత్రం'ను కొంతమంది అభ్యర్థులకు అందించినట్లు సీబీఐ తెలిపింది. అందులోని సుమారు 120 ప్రశ్నలు నీట్-యూజీ 2026 కెమిస్ట్రీ ప్రశ్నపత్రంలో వచ్చిన ప్రశ్నలతో సరిపోలినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో పరీక్షకు ముందే ప్రశ్నపత్రంలోని కీలక ప్రశ్నలు కొందరి చేతికి చేరినట్లు సీబీఐ దర్యాప్తులో గుర్తించింది.
Also Read:
వారిని నేల మీదకు దించాలి.. గంభీర్‌కు ఏబీ డివిల్లీర్స్ కీలక సూచన..