Share News

చోరీ సక్సెస్.. ప్లాన్ ఫెయిల్.. దొంగతనంలో ఊహించని ట్విస్ట్..

ABN , Publish Date - Apr 12 , 2026 | 02:25 PM

దొంగతనానికి ఇళ్లు అయితే కష్టం.. గుళ్లు అయితే బెటర్ అనుకున్నాడేమో.. ఓ గుడిని టార్గెట్ చేసుకున్నాడు. అర్థరాత్రి ఆ గుడిలోకి చొరబడ్డాడు. దొరికనకాడికి దోచుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది.. ఆ తరువాతే ఎవరూ ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. అదేంటో తెలియాలంటే పూర్తి వార్తలోకి వెళ్లాల్సిందే..

చోరీ సక్సెస్.. ప్లాన్ ఫెయిల్.. దొంగతనంలో ఊహించని ట్విస్ట్..

కోటి విద్యలు కూటికొరకే అంటారు. ఇతగాడు మాత్రం చోర విద్యను ఒంటబట్టించుకున్నాడు. ఇళ్లలో దొంగతనం చేస్తే దొరికిపోతానని భావించాడో ఏమో గానీ.. అతను చిన్న చిన్న ఆలయాలను టార్గెట్ చేసుకున్నాడు. అక్కడైతే ఎవరూ ఉండరని ధైర్యం కాబోలు. ఈ క్రమంలో ఆ దొంగ.. ఓ టెంపులో చొరబడ్డాడు. భారీగా డబ్బులు, నగలు ఉంటాయని భావించి ఆలయం మొత్తం జల్లెడ పట్టాడు. కానీ, అక్కడ అతనికి ఏమీ దొరకలేదు. కేవలం రూ.8,500 దొరకడంతో.. అదే మహాభాగ్యంగా భావించాడతను. భారీగా సొమ్ములుంటాయని భావించి గుడి మొత్తం జల్లెడ పట్టిన ఆ దొంగ.. ఆలసిపోయి ఆలయంలోనే పడుకున్నాడు. అలా పడుకున్న అతను ఆదమరచి నిద్రపోయాడు. ఇంకేముంది.. తెల్లారేసరికి ఆ చోరుడి కథ కటకటాల వెనక్కి చేరింది.


ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడులోని అంబూర్ జిల్లా కుడప్పనమూడులో ఉన్న కులువల్వట్టం శ్రీ భగతి ఆలయంలో సెంథిల్(40) అనే వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. ఆలయంలో దొంగతనం చేసిన అతను ఆదమరచి అక్కడే నిద్రపోయాడు. దొంగతనం అనంతరం పారిపోకుండా అక్కడే కునుకుతీశాడు. ఉదయం తెల్లవారుజామున 5:30 గంటలకు ఎప్పటిలాగే ఆలయ కమిటీ సభ్యులు ఆలయానికి చేరుకోగా తలుపులు పగలగొట్టి ఉండటాన్ని గమనించారు. దోపిడీ జరిగిందని భావించి ఆందోళనకు గురయ్యారు. లోపలికి వెళ్లి చూడగా.. దొంగ అక్కడే గురక పెడుతూ నిద్రపోతున్నాడు. అది చూసి వారు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే వెల్లరడ పోలీసులకు సమాచారం అందించారు.


ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. నిద్రపోతున్న సెంథిల్‌ను లేపి.. అదుపులోకి తీసుకున్నారు. దొంగతనం చేసిన డబ్బులను కూడా అతని చేతిలోనే పెట్టుకుని పడుకున్నాడు. ఆ డబ్బును సైతం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కోర్టులో హాజరుపరుచగా జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించారు. కాగా, సెంథిల్‌ గతంలోనూ అనేక దొంగతనాలకు పాల్పడ్డాడని.. అతనిపై చాలా కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గుడి ఆవరణలో చల్లగా ఉండటంతో అలసిపోయిన సెంథిల్ అక్కడే పడుకున్నాడని పోలీసులు వివరించారు.


Also Read:

మామిడి శ్రీఖండ్‌.. చూస్తేనే నోరూరిపోతుంది..

కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే పరిశ్రమలు వస్తున్నాయి: ఎమ్మెల్యే హరీశ్ రావు..

కాన్పూర్‌లో దారుణం.. కోడలిపై మామ దాడి.. వీడియో వైరల్!

Updated Date - Apr 12 , 2026 | 02:25 PM