Share News

కుక్కకాటుతో చిన్నారి ఆస్పత్రికి.. విరిగిన సూది శరీరంలో ఉంచి ఇంటికి..

ABN , Publish Date - Aug 04 , 2026 | 07:40 PM

మహారాష్ట్ర ఠాణే జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగుచూసింది. ఓ బాలుడికి ఇంజెక్షన్ ఇచ్చే క్రమంలో సూది విరిగి శరీరంలోనే ఉండిపోయింది. అయినప్పటికీ ఆ చిన్నారిని అలాగే ఇంటికి పంపారా వైద్యులు.

కుక్కకాటుతో చిన్నారి ఆస్పత్రికి.. విరిగిన సూది శరీరంలో ఉంచి ఇంటికి..

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర ఠాణే జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగుచూసింది. కుక్క కరిచిందని చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లిన ఓ మూడేళ్ల బాలుడికి ఇంజెక్షన్ ఇస్తుండగా.. సూది విరిగి శరీరంలోనే ఉండిపోయింది. అలాగే ఆ బాలుణ్ని ఇంటికి పంపించగా.. తీవ్ర నొప్పితో బాధపడుతుండటంతో మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు.


ఇదీ జరిగింది..

కవేశ్ అనే బాలుడు ఇంటి సమీపంలో ఆడుకుంటున్న సమయంలో ఓ పెంపుడు కుక్క కరిచింది. దీంతో తల్లిదండ్రులు ఆ బాలుణ్ని స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు అతడికి రేబీస్ నిరోధక టీకాలు ఇవ్వసాగారు. చేతులకు, తొడ భాగంలో 3 ఇంజెక్షన్లు ఇచ్చాక.. మరో ఇంజెక్షన్‌ను తుంటి భాగంలో ఇస్తుండగా సూది విరిగి శరీరంలోనే ఇరుక్కుపోయిందని బాలుడి తల్లి తెలిపారు. ఆ సమయంలో చిన్నారి కదలడం వల్లే అది విరిగిందని వైద్యురాలు చెప్పినట్టు ఆమె చెప్పారు.


సూది శరీరంలోనే ఉండిపోయిందని తాను పలుమార్లు చెప్పినా, కాదని వారించారని బాలుడి తల్లి వాపోయారు. ఆ సమయంలో అది ఎక్కడో పడిపోయిందని వైద్యులు తనకు నచ్చజెప్పారని ఆమె ఆరోపించారు. ఆ తర్వాత ఇతర సిబ్బంది పరిశీలించాక, సూది శరీరంలోనే ఉండే అవకాశముందని చెప్పినప్పటికీ.. అలాగే తన బిడ్డను ఇంటికి పంపారన్నారు. ఆ తర్వాత కాసేపటికే బాలుడు తీవ్ర నొప్పితో విలవిల్లాడటంతో కుటుంబ సభ్యులు అతణ్ని ముంబైలోని సియాన్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఎక్స్‌రే తీయగా సూది శరీరంలోనే ఉన్నట్లు నిర్ధారణ అయింది. వైద్యులు చిన్న శస్త్రచికిత్స ద్వారా ఆ సూది ముక్కను విజయవంతంగా తొలగించారు.


ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బిడ్డకు జరిగినట్టు మరెవరికీ జరగకుండా చూడాలని, అలాగే వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రైవేట్ ఆస్పత్రిలో శస్త్రచికిత్సకు అయిన వైద్య ఖర్చులను పరిహారంగా చెల్లించాలని ఆమె కోరారు.


ఇవీ చదవండి:

సునేత్రపై పవార్‌పై 'గంగీ గుడియా' వ్యాఖ్యలు.. 'మహా' రాజీయాల్లో దుమారం!

అస్సాం సీఆర్‌పీఎఫ్ క్యాంపులో విషాదం.. సహచరులపై కాల్పులకు దిగిన జవాన్

Updated Date - Aug 04 , 2026 | 08:03 PM