Share News

టెలిగ్రామ్ పై కేంద్రం సంచలన ఆరోపణలు

ABN , Publish Date - Jun 18 , 2026 | 03:55 PM

టెలిగ్రామ్ ఓ 'డార్క్ వెబ్'లా రూపాంతరం చెందిందని, సైబర్ మోసగాళ్లు, తీవ్రవాద గ్రూపులు చట్టం నుంచి తప్పించుకోవడానికి దీనిని విరివిగా ఉపయోగిస్తున్నారని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో ఓ అఫిడవిట్‌ దాఖలు చేసింది.

టెలిగ్రామ్ పై కేంద్రం సంచలన ఆరోపణలు
Telegram has become the New dark web: Center

న్యూ ఢిల్లీ, జూన్ 18: ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ ఫామ్ టెలిగ్రామ్(Telegram) చట్టవిరుద్ధ కార్యకలాపాలకు, సైబర్ నేరాలకు ప్రధాన వేదికగా మారిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుత రోజుల్లో టెలిగ్రామ్ ఓ సరికొత్త 'డార్క్ వెబ్'లా రూపాంతరం చెందిందని, నేరస్థులు, సైబర్ మోసగాళ్లు, తీవ్రవాద గ్రూపులు చట్టం నుంచి తప్పించుకోవడానికి దీనిని విరివిగా ఉపయోగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో ప్రభుత్వం ఇవాళ ఓ కీలక అఫిడవిట్‌ దాఖలు చేసింది.


అఫిడవిట్‌లోని ప్రధానాంశాలు, ఆరోపణలు:

లీకైన పరీక్ష పత్రాలు - ప్రశ్నార్థకమైన భవిష్యత్తు: NEET వంటి ప్రతిష్ఠాత్మక పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ, పంపిణీకి టెలిగ్రామ్ ఛానళ్లు వేదికగా మారాయని ప్రభుత్వం పేర్కొంది. ఇది దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తోందని తెలిపింది.

సైబర్ నేరాలు, డేటా లీకులు: నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ డేటా ప్రకారం, టెలిగ్రామ్ వేదికగా జరుగుతున్న సైబర్ మోసాలపై ఫిర్యాదులు భారీగా పెరిగాయి. హ్యాకర్లు, సైబర్ నేరగాళ్లు దొంగిలించిన డేటాను విక్రయించడానికి, మనీ లాండరింగ్ కోసం 'మ్యూల్ బ్యాంక్ ఖాతాల'ను కొనుగోలు చేయడానికి ఈ ప్లాట్‌ఫామ్‌ను వాడుతున్నారు.

చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్(CSEAM): చిన్నారుల లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ టెలిగ్రామ్ ద్వారా వ్యాప్తి చెందుతోందని, భద్రతా సంస్థలకు ఇది పెద్ద సవాలుగా మారిందని కోర్టుకు తెలిపింది.

తీవ్రవాద ప్రచారం - శాంతిభద్రతలకు విఘాతం: ఉగ్రవాద సంస్థలు, తీవ్రవాద గ్రూపులు తమ భావజాలాన్ని ప్రచారం చేసేందుకు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం ద్వారా పౌర సమాజంలో అశాంతిని రేకెత్తించడానికి టెలిగ్రామ్ గ్రూపులను వాడుకుంటున్నాయని చెప్పింది.

మాల్వేర్, కమాండ్ అండ్ కంట్రోల్ హబ్: కొన్ని ప్రమాదకరమైన ఆండ్రాయిడ్ అప్లికేషన్లు బాధితుల డేటాను దొంగిలించడానికి టెలిగ్రామ్‌ను కమాండ్ అండ్ కంట్రల్ ప్లాట్‌ ఫామ్‌గా వాడుకుంటున్నాయి. గూగుల్ ప్లే ప్రొటెక్ట్‌ను బైపాస్ చేసే టూల్స్, నకిలీ ఫైనాన్స్ యాప్‌ల రూపంలో ఉండే మాల్వేర్‌లను ఇక్కడ బహిరంగంగానే ప్రకటిస్తున్నారని కేంద్రం కోర్టుకు చెప్పింది.

వ్యక్తిగత డేటా విక్రయించే బోట్లు: గతంలో లీకైన డేటాబేస్‌ల ఆధారంగా పౌరుల మొబైల్ నంబర్లు, ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డుల వివరాలు, సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేసేలా టెలిగ్రామ్ బోట్లు(Bots) పనిచేస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది.

పైరసీ రంగస్థలం: కేవలం సైబర్ నేరాలే కాకుండా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు, కాపీరైట్ ఉన్న కంటెంట్‌ను అనధికారికంగా పంపిణీ చేయడం ద్వారా కంటెంట్ క్రియేటర్లకు భారీ ఆర్థిక నష్టాన్ని కలిగిస్తోందని కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొంది.

చట్టాన్ని అడ్డుకుంటున్న ప్రైవసీ ఫీచర్లు:

టెలిగ్రామ్‌లో ఉన్న మితిమీరిన ప్రైవసీ, అనామక ఫీచర్లు నేరగాళ్లకు రక్షణ కవచాలుగా మారాయని కేంద్రం అఫిడవిట్‌లో వివరించింది. వినియోగదారులు తమ ఫోన్ నంబర్లు, టెలిగ్రామ్ ఐడీలను దాచుకునే సదుపాయం ఉండటం వల్ల, నేరాల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించడం పరిశోధనా సంస్థలకు అత్యంత క్లిష్టంగా మారుతోందని కోర్టుకు విన్నవించింది కేంద్రం.


ఇవీ చదవండి:

డీఎంకేకు మరో షాక్.! టీవీకే వైపు ఎండీఎంకే.?

బీబీ ఒకసారి ఆలోచించండి.. మీకు కావాల్సినదే దక్కింది: ట్రంప్

Updated Date - Jun 18 , 2026 | 05:03 PM