Share News

పోరాట స్ఫూర్తికి ప్రతీక తెలంగాణ

ABN , Publish Date - Jun 03 , 2026 | 06:13 AM

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మలికార్జున ఖర్గే తదితరులు రాష్ట్ర ప్రజలకు ‘ఎక్స్‌’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు...

పోరాట స్ఫూర్తికి ప్రతీక తెలంగాణ

  • రాష్ట్ర అవతరణ వేళ ప్రధాని మోదీ శుభాకాంక్షలు

  • తెలంగాణ ప్రగతి ప్రశంసనీయం: రాష్ట్రపతి ముర్ము

  • ‘ఇందిరమ్మ రాజ్యం’ స్ఫూర్తితో ముందుకు: ఖర్గే

  • దేశ గమనంలో తెలంగాణ కీలక పాత్ర: అమిత్‌ షా

  • నిరంతరం స్ఫూర్తినిచ్చే తెలంగాణ: ప్రియాంక

న్యూఢిల్లీ, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మలికార్జున ఖర్గే తదితరులు రాష్ట్ర ప్రజలకు ‘ఎక్స్‌’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం ధైర్యానికి, సంకల్పానికి, పోరాట స్ఫూర్తికి ప్రతీక అని ప్రధాని మోదీ కొనియాడారు. గొప్పచరిత్ర, వైభవోపేతమైన సంస్కృతి తెలంగాణ సొంతమని పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణలు, ఆలోచనలు, ఔత్సాహిక పారిశ్రామిక తత్వానికి రాష్ట్ర ప్రజలు పెట్టింది పేరు అని, వికసిత్‌ భారత్‌ కలను సాకారం చేసే క్రమంలో తెలంగాణ అభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు విజయపథంలో పురోగమించాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రగతిపథం ప్రశంసనీయమని రాష్ట్రపతి ముర్ము కొనియాడారు. రాష్ట్రం సంపన్నమైన సాంస్కృతిక వారసత్వంతో, కష్టపడి పనిచేసే ప్రజలతో విలసిల్లుతోందని, కొన్నేళ్లుగా ఆవిష్కరణలు, అభివృద్ధి రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించిందన్నారు. తెలంగాణ ప్రజలు నిరంతర ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. విశిష్ట సంస్కృతి, అద్భుతమైన పారిశ్రామిక నైపుణ్యంతో దేశ గమనంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. రాష్ట్రం మరిన్ని ప్రగతి శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఇందిరమ్మ రాజ్యం స్ఫూర్తితో తెలంగాణ ముందుకుసాగుతోందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే పేర్కొన్నారు. ‘తెలంగాణ అవతరణం చరిత్రాత్మకం. త్యాగాలు, పట్టుదల, లక్షలాది మంది ప్రజల అచంచలమైన ఆకాంక్షల నుంచి ఉద్భవించిన రాష్ట్రం. నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, సోనియా గాంధీల నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను గౌరవించి తెలంగాణ కలను సాకారం చేసింద’న్నారు.


నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన వారందరికీ పేరుపేరున నివాళులు అర్పిస్తున్నానని, వారి ధైర్యం, నిబద్ధత ఈ రాష్ట్ర ఆత్మలో ఎప్పటికీ నిలిచిపోతాయని పేర్కొన్నారు. తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, సమగ్ర వృద్ధి, అందరికీ సమాన అవకాశాలతో కూడిన నిజమైన ‘ప్రజల తెలంగాణ’ సాధనే లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. ధైర్య సాహసాలు, ఆవిష్కరణలు, పురోగతికి నిలయమైన తెలంగాణ నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉందని కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు. తెలంగాణ మరింతగా వర్థిల్లుతూ అందరికీ మరిన్ని అవకాశాలు కల్పించాలని ఆకాంక్షించారు.

తెలంగాణ భవన్‌లో వేడుకలు

న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశాంక్‌ గోయల్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జూన్‌ 5న తెలంగాణ సాంస్కృతిక ప్రదర్శనలు, వంటకాలతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ వేడుకల్లో సమన్వయ కార్యదర్శి అద్వైత్‌ కుమార్‌ సింగ్‌ పాల్గొన్నారు.

Also Read:

ఖర్జూరాలు.. కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయా?

చిన్న పిల్లాడిలా మారి.. డ్యాన్స్ చేసిన విరాట్! వీడియో వైరల్...

For More Latest News

Updated Date - Jun 03 , 2026 | 06:13 AM