Share News

టెక్నాలజీ కూడా కాపీ-పేస్టే... రోబో డాగ్ వివాదంపై సిద్ధరామయ్య

ABN , Publish Date - Feb 18 , 2026 | 08:28 PM

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. టెక్నాలజీని కూడా 'కాపీ-పేస్ట్' వ్యవహారంగా మార్చిందని ఆరోపించారు.

టెక్నాలజీ కూడా కాపీ-పేస్టే... రోబో డాగ్ వివాదంపై సిద్ధరామయ్య
Siddaramaiah on Robodog row

బెంగళూరు: దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన ఏఐ ఇంపాక్ట్ సమిట్‌లో గోల్‌గోతియాస్ యూనివర్శిటీ ప్రతినిధులు తాము తయారు చేశామంటూ రోబో డాగ్‌ను ప్రదర్శించడం, అయితే అది యూనివర్శిటీ క్రియేషన్ కాదని, చైనాకు చెందిన యూనీ ట్రీ రోబోటెక్స్ కంపెనీ తయారు చేసిందని తేలడం సంచలనమైంది. దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. టెక్నాలజీని కూడా 'కాపీ-పేస్ట్' వ్యవహారంగా మార్చిందని ఆరోపించారు.


'మొదట యూపీఏ స్కీమ్‌లను వాళ్లు కాపీ చేశారు. కాంగ్రెస్ గ్యారెంటీలను కాపీ కొట్టి వాటిని రీబ్రాండ్‌‌ చేసి, తమ గ్రాండ్ విజన్‌‌గా చెప్పుకున్నారు. ఇప్పుడు టెక్నాలజీని కూడా కాపీ-పేస్ట్ చేశారు' అని సిద్ధరామయ్య సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పేర్కొన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి 'మేక్ ఇన్ ఇండియా' మీద నమ్మకం లేదని, 'ఫేక్ ఇన్ ఇండియా'నే వాళ్లు నమ్ముతారని విమర్శించారు. రోబో డాగ్ వ్యవహారంతో ఏఐ ఇంపాక్ట్ వంటి కీలకమైన వేదికపై భారత్‌కు అంతర్జాతీయంగా తలవంపులు తెచ్చారని అన్నారు.


'బీజేపీతో సంబంధం ఉన్న ఒక సంస్థ ఏఐ ఇంపాక్ట్ సదస్సులో చైనా రోబోను ఇండియా ఇన్నొవేషన్‌గా ప్రకటించుకుంది. చైనా మీడియా వెంటనే గుట్టు బయటపెట్టింది. ఈ పరిణామం అంతర్జాతీయంగా దేశానికి తలవంపులు తెచ్చింది' అని సిద్ధరామయ్య ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. 'లీడర్ ఎలా ఉంటే అనుచరులు కూడా అలాగే ఉంటారు' అంటూ చురకలు వేశారు. ఈ ఘటనతో భారత ప్రతిష్ట దిగజారిందని, అదే అసలైన అవమానమని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

ఏఐ సమిట్‌లో ఊహించని పరిణామం.. అది చైనా రోబో డాగ్.. ఇండియాది కాదు..

ఇండియా ఏఐ సమ్మిట్‌కు అద్భుతమైన రెస్పాన్స్.. మరో రోజు పొడిగింపు..

Updated Date - Feb 18 , 2026 | 08:31 PM