ఏఐ సమిట్‌లో ఊహించని పరిణామం.. అది చైనా రోబో డాగ్.. ఇండియాది కాదు..
ABN , Publish Date - Feb 18 , 2026 | 06:08 PM
‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్’లో గ్రేటర్ నోయిడాకు చెందిన గోల్‌గోతియాస్ యూనివర్సిటీకి చేదు అనుభవం ఎదురైంది. సమిట్ నిర్వాహకులు గోల్‌గోతియాస్ యూనివర్సిటీ ప్రతినిధులను అక్కడినుంచి వెంటనే వెళ్లిపోమని ఆదేశించినట్లు తెలుస్తోంది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: దేశ రాజధాని ఢిల్లీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్’ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమిట్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. గ్రేటర్ నోయిడాకు చెందిన గోల్‌గోతియాస్ యూనివర్సిటీకి చేదు అనుభవం ఎదురైంది. సమిట్ నిర్వాహకులు గోల్‌గోతియాస్ యూనివర్సిటీ ప్రతినిధులను అక్కడినుంచి వెంటనే వెళ్లిపోమని ఆదేశించినట్లు తెలుస్తోంది. సదరు యూనివర్సిటీకి చెందిన ప్రతినిధులు చేసిన తప్పుడు ప్రచారం కారణంగానే బహిష్కరణకు గురైనట్లు సమాచారం.
పలు జాతీయ మీడియాల కథనం ప్రకారం.. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్‌లో గోల్‌గోతియాస్ యూనివర్సిటీకి చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. తమ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ తయారు చేసిందంటూ ఓ రోబో డాగ్‌ను ప్రదర్శనకు ఉంచారు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోలతో యూనివర్సిటీ పరువు పోయింది. ప్రదర్శనకు ఉంచిన ఆ రోబో డాగ్ యూనివర్సిటీ తయారు చేసినది కాదని, ఆన్‌లైన్‌లో కొన్నదని తేలింది. యూనీట్రీ గో 2 అనే ఆ రోబో డాగ్‌ను చైనాకు చెందిన యూనీ ట్రీ రోబోటిక్స్ కంపెనీ తయారు చేసింది.
ఆ రోబో డాగ్స్ ఆన్‌లైన్ ద్వారా ఇండియాలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఒక్కో రోబో డాగ్ ధర 2 లక్షల రూపాయల నుంచి 3 లక్షల వరకు ఉంది. యూనివర్సిటీకి చెందిన ప్రతినిధులు చైనా రోబో డాగ్‌కి ‘ఓరియాన్’ అని పేరు పెట్టి ప్రదర్శనకు ఉంచారు. వైరల్‌గా మారిన వీడియోలో యూనివర్సిటీ ప్రతినిధి మాట్లాడుతూ.. ఆ రోబో డాగ్‌ను తమ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ తయారు చేసిందని చెప్పుకొచ్చారు. ఇదే యూనివర్సిటీ కొంప ముంచింది. ఈ వీడియో వైరల్‌గా మారి సమిట్ నిర్వాహకుల దృష్టికి వెళ్లటంతో వారు యూనివర్సిటీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమిట్ నుంచి వెళ్లిపోమని ఆదేశించారు. ఇక, ఈ వివాదంపై యూనివర్సిటీ ఎక్స్ వేదికగా స్పందించింది. బోధనలో భాగంగా తమ విద్యార్థుల కోసం దానిని యూనీట్రీ కంపెనీనుంచి కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఆ రోబో డాగ్‌ను తామే తయారు చేశామని ఎక్కడా చెప్పలేదని అంది. తమపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, వైరల్‌గా మారిన వీడియోలో యూనివర్సిటీ ప్రతినిధి ఆ డాగ్‌ను తామే తయారు చేశామని పేర్కొనటం గమనార్హం.
ఇవి కూడా చదవండి
అసెంబ్లీలో జరిగే చర్చలు ఎలా ఉన్నాయ్.. విద్యార్థులతో అయ్యన్న మాటామంతి
గొగోయ్‌పై సీఎం ఆరోపణలు... సర్వే ఏం చెప్పిందంటే..