Share News

తరుణ్‌ తేజ్‌పాల్‌కు పదేళ్ల జైలు

ABN , Publish Date - Aug 07 , 2026 | 05:44 AM

సహోద్యోగినిపై లైంగికదాడికి పాల్పడ్డారంటూ ఆరోపణలకు సంబంధించిన కేసులో తెహల్కా మాజీ ఎడిటర్‌, 62 ఏళ్ల తరుణ్‌ తేజ్‌పాల్‌ను బాంబే హైకోర్టు దోషిగా నిర్ధారించింది. ఆయనకు...

తరుణ్‌ తేజ్‌పాల్‌కు పదేళ్ల జైలు

  • రూ.10.21 లక్షల జరిమానా

  • సహోద్యోగినిపై లైంగిక దాడి కేసులో తీర్పు

  • 4 వారాల్లోగా లొంగిపోవాలి బాంబే హైకోర్టు ఆదేశం

  • నా వయసు 62 ఏళ్లు.. దయ చూపండి: తేజ్‌పాల్‌

  • తండ్రి స్థానంలో ఉండి ఆయన నేరానికి పాల్పడ్డారు

  • సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు

పనాజి, ఆగస్టు 6: సహోద్యోగినిపై లైంగికదాడికి పాల్పడ్డారంటూ ఆరోపణలకు సంబంధించిన కేసులో తెహల్కా మాజీ ఎడిటర్‌, 62 ఏళ్ల తరుణ్‌ తేజ్‌పాల్‌ను బాంబే హైకోర్టు దోషిగా నిర్ధారించింది. ఆయనకు పదేళ్ల కఠిన జైలు శిక్ష, రూ.10.21 లక్షల జరిమానా విధిస్తూ తీర్పిచ్చింది! ఐదేళ్ల క్రితం తేజ్‌పాల్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ గోవా సెషన్స్‌ కోర్టు వెలువరించిన తీర్పును బాంబే హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు బాంబే హైకోర్టు గోవా బెంచ్‌కు చెందిన జస్టిస్‌ నీలా గోఖలే, జమ్సండేకర్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. తాను రాజకీయ కుట్రలకు బలయ్యానని, ప్రస్తుతం తన వయసు 62 ఏళ్లని, తనకు భార్య, ఇద్దరు ఆడపిల్లలున్నారని.. తన పట్ల కనికరం చూపాలని కోర్టును తేజ్‌పాల్‌ వేడుకున్నారు. తేజ్‌పాల్‌కు ఎలాంటి నేరచరిత్ర లేదని, శిక్షా కాలాన్ని వీలైనంత తగ్గించాలని తేజ్‌పాల్‌ తరఫు న్యాయవాది అబాద్‌ పోండా చేసిన విజ్ఞప్తిని కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. కూతురు వయసున్న సహోద్యోగిని పట్ల తరుణ్‌ తేజ్‌పాల్‌ నేరానికి పాల్పడ్డారంటూ విచారణ సందర్భంగా గోవా ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన తుషార్‌ మెహతా పేర్కొన్నారు. తేజ్‌పాల్‌ను వెంటనే అరెస్టు చేయాలని ఆయన్ను దోషిగా ప్రకటించిన అనంతరం ధర్మాసనాన్ని కోరారు. అయితే తేజ్‌పాల్‌ రెండువారాల్లోగా లొంగిపోవాలని ధర్మాసనం తొలుత ఆదేశించింది. తర్వాత ఆయన తరఫు న్యాయవాదుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని గడువును నాలుగు వారాలకు పొడిగించింది. జరిమానాగా విధించిన మొత్తాన్నంతా బాధితురాలికి తేజ్‌పాల్‌ చెల్లించాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొంది. బాంబే హైకోర్టు వెలువరించిన తీర్పుపై తరుణ్‌ తేజ్‌పాల్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తీర్పు అసంబద్ధంగా ఉందని, దీన్ని తాను సుప్రీంకోర్టులో సవాలు చేయనున్నట్లు పేర్కొన్నారు. పదమూడేళ్ల క్రితం.. 2013 నవంబరులో గోవాలోని ఓ విలాసవంతమైన హోటల్‌లో జరిగిన ‘థింక్‌ ఫీస్ట్‌ ఈవెంట్‌’ సందర్భంగా లిఫ్ట్‌లో జూనియర్‌ సహోద్యోగినిపై తేజ్‌పాల్‌ లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. అదేనెలలో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం తేజ్‌పాల్‌ బెయిల్‌పై విడుదలయ్యారు. 2017లో మపుసా ట్రయల్‌ కోర్టులో విచారణ ప్రారంభమైంది. 2021లో ట్రయల్‌కోర్టు తేజ్‌పాల్‌ను నిర్దోషిగా ప్రకటించింది. ఈ తీర్పును గోవా ప్రభుత్వం హైకోర్టులో సవాలు చేసింది.


విచారణ ప్రారంభమైనప్పటి నుంచి కూడా తేజ్‌పాల్‌ బెయిల్‌ మీద ఉన్నారని, న్యాయస్థానాలు విధించిన ఆదేశాల్లో ఏ ఒక్కటీ ఆయన ఉల్లంఘించలేదని, ఆయన వయసు పైబడిన వ్యక్తి అనే విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని ధర్మాసనానికి న్యాయవాది పోండా విజ్ఞప్తి చేశారు. అయితే తేజ్‌పాల్‌కు గరిష్ఠ శిక్ష విధించాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదించారు. లైంగిక దాడి ఘటన తర్వాత బాధితురాలి తీరు సాధారణంగానే ఉందంటూ ఆమె ప్రవర్తనను ప్రశ్నించడం ద్వారా తేజ్‌పాల్‌ నిస్సిగ్గు వైఖరిని చాటుకున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. బాధితురాలు తేజ్‌పాల్‌ సహోద్యోగి మాత్రమే కాదని, ఆయన కూతురు స్నేహితురాలని.. ఘటన తర్వాత ఆయనలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని పేర్కొన్నారు. ఘటన జరిగిన మర్నాడు, విచారణ జరిగినన్నాళ్లూ, తాజాగా కోర్టు ఎదుట కూడా ఆయన బాధితురాలినే తప్పుబడుతున్నారని పేర్కొన్నారు. ‘‘సమాజానికి బలమైన సందేశం ఇవ్వాల్సిన సమయం ఇది. శిక్ష అనేది చట్టబద్ధంగా ఉండాలి. బాధితురాలు తిరస్కరిస్తున్నా కూడా ఆమెను తేజ్‌పాల్‌ బలవంతం చేశారు. అమ్మాయి ఒకసారి వద్దు అని చెబితే దాని అర్థం వద్దు అనే’’ అని తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం ద్విసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది.

వార్తలు కూడా చదవండి...

కేంద్రమంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ

కల్తీ మసాలాలపై చర్యలు.. అంతర్రాష్ట్ర ముఠాలపై సిట్ ఫోకస్

క్షుద్రపూజలు చేయలేదని హరీశ్‌రావు ప్రమాణం చేసి చెప్పగలుగుతారా..?: అద్దంకి ద‌యాక‌ర్

Read Latest Telangana News And AP News And National News

Updated Date - Aug 07 , 2026 | 06:04 AM