ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లా నేనూ బాధితుడినే.. కోర్టు తీర్పు అనంతరం తరుణ్ తేజ్‌పాల్
ABN , Publish Date - Aug 06 , 2026 | 04:56 PM
ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్, సురేంద్ర గాడ్లింగ్ లాగానే తానూ రాజకీయ కక్షసాధింపునకు గురయ్యానని తెహెల్కా మాజీ ఎడిటర్-ఇన్-చీఫ్ తరుణ్ తేజ్‌పాల్ పేర్కొన్నారు. తెహెల్కా చేసిన దర్యాప్తు కథనాల వల్ల కొందరి రాజకీయ ప్రయోజనాలకు నష్టం కలిగిందని, అందుకే తనపై కేసు పెట్టారని ఆయన ఆరోపించారు.
న్యూఢిల్లీ: ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్, సురేంద్ర గాడ్లింగ్ లాగానే తానూ రాజకీయ కక్షసాధింపునకు గురయ్యానని తెహెల్కా మాజీ ఎడిటర్-ఇన్-చీఫ్ తరుణ్ తేజ్‌పాల్ పేర్కొన్నారు. తెహెల్కా చేసిన దర్యాప్తు కథనాల వల్ల కొందరి రాజకీయ ప్రయోజనాలకు నష్టం కలిగిందని, అందుకే తనపై కేసు పెట్టారని ఆయన ఆరోపించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తరుణ్ తేజ్‌పాల్ లైంగిక దాడి కేసులో గోవా బెంచ్ ఆఫ్ బొంబాయి హైకోర్టు ఇవాళ (గురువారం) కీలక తీర్పు వెలువరించింది. తేజ్‌పాల్ తన సహోద్యోగి అయిన జూనియర్ మహిళా జర్నలిస్టుపై అత్యాచారం చేసినట్లు న్యాయస్థానం నిర్ధారించింది. ఈ మేరకు 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.5 లక్షల జరిమానా విధించింది.
కోర్టు తీర్పు అనంతరం తరుణ్ తేజ్‌పాల్ మీడియాతో మాట్లాడారు. తనపై కొందరు గత 13 ఏళ్లుగా ప్రతీకారంతో రగిలిపోతున్నారని అన్నారు. ఈ కేసులో తనను పది సార్లు నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసే ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. న్యాయవ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, దీనిపై త్వరలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్, భీమా కోరేగావ్ కేసులో అరెస్టైన సురేంద్ర గాడ్లింగ్ పేర్లను తేజ్‌పాల్ ప్రస్తావించారు. వారిలాగే తానూ రాజకీయ కక్షసాధింపునకు గురైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, విచారణ సందర్భంగా గోవా ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కీలక వాదనలు వినిపించారు. బాధితురాలు పలుమార్లు నిరాకరించినప్పటికీ తేజ్‌పాల్ వినలేదని, 'నో అంటే నో' అనే ప్రాథమిక సూత్రాన్నే ఆయన పట్టించుకోలేదని కోర్టుకు వివరించారు. నేర తీవ్రత దృష్ట్యా ఆయనకు గరిష్ఠ శిక్ష విధించాలని కోరారు.
అయితే, తనకిప్పుడు 62 సంవత్సరాలని, తానూ బాధితుడినేనని నమ్ముతున్నానని కోర్టుకు తేజ్‌పాల్ విన్నవించారు. తనకు భార్య ఉందని, శిక్ష విషయంలో దయచేసి కనికరం చూపాలని కోరారు. విచారణ అనంతరం న్యాయస్థానం తన తీర్పులో కీలక వ్యాఖ్యలు చేసింది. తెహెల్కా ఎడిటర్-ఇన్-చీఫ్‌గా తేజ్‌పాల్ ఉన్న సమయంలో బాధితురాలు ఆయన కింద పని చేసిందని, వారి మధ్య అధికార అసమానత స్పష్టంగా ఉందని పేర్కొంది. ఆ వృత్తిపరమైన ఆధిపత్యాన్ని ఆయన దుర్వినియోగం చేశారని అభిప్రాయపడింది. ఈ సందర్భంగా బాధితురాలిపై జరిగిన అత్యాచారం నిజమేనని నిర్ధారించి తీర్పు వెలువరించింది.
కాగా, గోవాలో 2013 నవంబర్ 7, 8 తేదీల్లో థింక్‌ఫెస్ట్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హోటల్ లిఫ్ట్‌లో తేజ్‌పాల్ తనపై రెండు సార్లు అత్యాచారం చేశాడని పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన అప్పుట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత కోర్టు అతనిని దోషిగా తేల్చింది.
ఈ వార్తలు కూడా చదవండి
నీట్-యూజీ పరీక్ష విధానంలో మార్పులపై కేంద్రం కీలక అఫిడవిట్..
విమాన ఇంధనంలో ఇథనాల్ కలపడం లేదు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు..