Share News

కొత్త-పాతల కలబోత!

ABN , Publish Date - May 11 , 2026 | 06:28 AM

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్‌ విజయ్‌ తొమ్మిది మంత్రులతో తన క్యాబినెట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అయితే, మంత్రుల ఎంపికలో కొత్త వారితోపాటు అనుభవం ఉన్నవారికి...

కొత్త-పాతల కలబోత!

సీఎం విజయ్‌ మంత్రివర్గంలో మహిళ సహా 9 మందికి చాన్స్‌

  • సామాజిక వర్గాల కూర్పులోనూ ఆచితూచి అడుగేసిన టీవీకే చీఫ్‌

చెన్నై, మే 10(ఆంధ్రజ్యోతి): తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్‌ విజయ్‌ తొమ్మిది మంత్రులతో తన క్యాబినెట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అయితే, మంత్రుల ఎంపికలో కొత్త వారితోపాటు అనుభవం ఉన్నవారికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. తమిళ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న సెంగోట్టయ్యన్‌ వంటి వారితోపాటు యువ నేతలకు కూడా తన మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. అదేసమయంలో సామాజిక వర్గాల కూర్పునకు కూడా అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఇక, తాజాగా మంత్రి పదవులు దక్కించుకున్న వారంతా టీవీకే పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం.

ప్రభు: కారైకుడి నియోజకవర్గంలో పోటీచేసి విజయం సాధించిన ప్రభు.. దంత వైద్యుడిగా పేరు తెచ్చుకున్నారు. సమాజ సేవలో పాల్గొనడం ద్వారా సోషల్‌ మీడియాలో ప్రజాదరణను చూరగొన్నారు. విజయ్‌ మంత్రి వర్గంలో సీటు సొంతం చేసుకున్నారు.

రాజ్‌మోహన్‌: మంచి వక్తగా పేరుగడించిన రాజ్‌మోహన్‌ బీటెక్‌ చదివారు. ఎగ్మూర్‌ నియోజకవర్గం నుంచి టీవీకే తరఫున గెలుపొందారు. యూట్యూబ్‌ చానల్‌ ద్వారా పార్టీ ప్రచారానికి తన వంతు ప్రచార సేవలందించారు. డీఎంకే కంచుకోటగా ఉన్న ఎగ్మూర్‌ స్థానం నుంచి పోటీచేసి విజయం దక్కించుకుని మంత్రి అయ్యారు.

బుస్సీ ఎన్‌. ఆనంద్‌: పుదుచ్చేరికి చెందిన ఆనంద్‌ రాజకీయ ప్రస్థానం కాంగ్రె్‌సతోనే ప్రారంభమైంది. విజయ్‌ అభిమానుల సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. 2006 శాసనసభ ఎన్నికల్లో పుదచ్చేరి మున్నేట్ర కాంగ్రెస్‌ తరఫున ‘బుస్సీ’ నియోజకవర్గంలో పోటీచేసి విజయం సాధించారు. అప్పటి నుంచి ఆయన పేరు బుస్సీ ఆనంద్‌గా మారిపోయింది. విజయ్‌ రాజకీయ ప్రస్థానంలో ఆయనకు కుడిభుజంగా వ్యవహరించారు. ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆనంద్‌ తాజా ఎన్నికల్లో టి.నగర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు.


అరుణ్‌రాజ్‌: సేలం జిల్లాకు చెందిన అరుణ్‌రాజ్‌ వైద్యుడిగా పనిచేస్తున్నారు. మద్రాసు వైద్య కళాశాల నుంచి ఎంబీబీఎస్‌ డిగ్రీ పొందిన ఆయన.. ప్రభుత్వ వైద్యుడిగా పనిచేశారు. సివిల్‌ సర్వీస్‌ పరీక్షలో విజయం సాధించి ఆదాయపు పన్ను శాఖ అధికారిగా పనిచేశారు. ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ చేసి టీవీకేలో చేరారు. నామక్కల్‌ జిల్లా తిరుచెంగోడు నియోజకవర్గంలో విజయం సాధించిన అరుణ్‌రాజ్‌కు విజయ్‌ మంత్రిగా అవకాశం ఇచ్చారు.

ఆదవ్‌ అర్జున: లాటరీల అధినేత మార్టిన్‌ అల్లుడైన ఆదవ్‌ అర్జున గతంలో వీసీకే పార్టీలో ఉన్నారు. ఎన్నికలకు కొన్నాళ్ల ముందు టీవీకేలో చేరి విజయ్‌ అభిమానం పొందారు. ఆ పార్టీలో కీలకపాత్రను పోషించారు. స్థానిక విల్లివాక్కం నియోజకవర్గం నుంచి గెలుపు గుర్రం ఎక్కి.. విజయ్‌ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.

సెంగోట్టయన్‌: అన్నాడీఎంకే మాజీ మంత్రి సెంగోట్టయన్‌. ప్రస్తుతం 10వసారి ఆయన శాసనసభకు ఎన్నికయ్యారు. ఎంజీఆర్‌ కాలం నుంచి రాజకీయాల్లో ఉన్న సెంగోట్టయ్యన్‌.. జయలలిత, పళనిస్వామి హయాంలో మంత్రిగా పనిచేశారు. అటవీ, రవాణా, వ్యవసాయం, విద్యాశాఖలను చూశారు. ఎన్నికలకు ముందు ఎడప్పాడిపై కినుక వహించి అన్నాడీఎంకే నుంచి వైదొలగి టీవీకేలో చేరారు.

వెంకటరమణన్‌: చెన్నై నగరానికి చెందిన వెంకటరమణన్‌.. మైలాపూర్‌ నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారు. గత కొన్నేళ్లుగా ఆయన విజయ్‌ ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షిస్తున్నారు. టీవీకే పార్టీ కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు. బ్రాహ్మణ వర్గానికి చెందిన ఆయన... ఆడిటర్‌గా మంచి గుర్తింపు పొందారు.

నిర్మల్‌ కుమార్‌: బీఈ, ఎల్‌ఎల్‌బీ, ఎంఏ చదివిన నిర్మల్‌కుమార్‌.. తిరుప్పరంకుండ్రం నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. ప్రారంభంలో బీజేపీలో ఉన్న ఆయన.. అక్కడి నుంచి అన్నాడీఎంకే పార్టీకి మారారు. ఆ పార్టీ ఐటీ వింగ్‌ నిర్వహణ బాధ్యత చూశారు. అనంతరం అన్నాడీఎంకేతో విబేధాలు రావడంతో విజయ్‌ పార్టీలో చేరారు. విజయ్‌ పార్టీలోని ప్రముఖ నేతల్లో ఒకరిగా మారారు. తాజాగా విజయ్‌ మంత్రివర్గంలో చోటు సంపాయించుకున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి...

డీఎంకే ఓటమికి అవినీతి పాలనే కారణం: మంత్రి సత్యకుమార్

జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. ఎంపీ శ్రీ భరత్ ధ్వజం

సింగపూర్ మోడల్‌లో ఫిర్యాదుల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ప్లాన్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 11 , 2026 | 06:42 AM