Share News

పెట్టుబడుల పోటీలో గూఢచారులు?

ABN , Publish Date - Nov 20 , 2026 | 04:11 AM

పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటాపోటీ నెలకొన్న రోజులివి! ఏదైనా ఒక కంపెనీ ‘ఫలానా’ రాష్ట్రానికి వస్తుందని తెలియగానే...

పెట్టుబడుల పోటీలో గూఢచారులు?

  • తమిళనాడు పెట్టుబడుల సమాచారం లీక్‌!

  • అటు ఏపీకి.. ఇటు విపక్షనేత స్టాలిన్‌కు!

  • ఏపీకి తరలిన రెండు కొరియా కంపెనీలు

  • ఒప్పందానికి పదిరోజుల ముందే స్టాలిన్‌ ట్వీట్‌

  • నాడే తమిళనాట రాజకీయ కలకలం

  • ‘గైడెన్స్‌ తమిళనాడు’ ఏజెన్సీ నుంచే లీక్‌!

  • 15 మందికి ఉద్వాసనతో మరిన్ని అనుమానాలు

  • ‘స్పై’ సినిమా లేదంటున్న విజయ్‌ సర్కారు వర్గాలు

  • ప్రభుత్వం మారగానే మార్పులు సహజమనే వాదన

(చెన్నై - ఆంధ్రజ్యోతి): పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటాపోటీ నెలకొన్న రోజులివి! ఏదైనా ఒక కంపెనీ ‘ఫలానా’ రాష్ట్రానికి వస్తుందని తెలియగానే... ‘మేం అంతకు మించి రాయితీలు ఇస్తాం’ అని ఆఫర్లు ఇస్తున్న కాలమిది! అయినప్పటికీ... ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన రెండు పెట్టుబడుల చుట్టూ జాతీయ స్థాయిలో వివాదం చెలరేగుతోంది. తమిళనాడుకు రావాల్సిన కంపెనీలను ఏపీ ఎగరేసుకుపోయిందని... దీనికి తమిళనాడు ప్రభుత్వం కోసం పనిచేయాల్సిన ఏజెన్సీలోని కొందరు అధికారులు ఏపీకి ఇచ్చిన లీకులే కారణమనే వార్తలు వెలువడ్డాయి.

పెట్టుబడుల అంశంపై ఇప్పటికే అధికార టీవీకే - ప్రతిపక్ష డీఎంకే మధ్య మాటల యుద్ధం జరుగుతుండటం... అదే సమయంలో, తమిళనాడు పరిశ్రమల శాఖకు అనుబంధంగా పనిచేసే ‘గైడెన్స్‌ తమిళనాడు’ అనే నోడల్‌ ఏజెన్సీలోని 15 మందిపై వేటుపడటం వంటి పరిణామాలతో ఈ విషయం రచ్చకెక్కింది.


అసలేం జరిగింది...

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ నెల 12, 13 తేదీల్లో విశాఖలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భాగస్వామ్య సదస్సు నిర్వహించింది. ఇందులో సుమారు 9.88 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 303 ఒప్పందాలు కుదిరాయి. ఇందులో కేవలం రెండు కంపెనీలతో కుదిరిన ఒప్పందాలే ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువులుగా మారాయి. అవి... దక్షిణ కొరియాకు చెందిన హాషిన్‌, సీయాన్‌ సంస్థలు! హాషిన్‌ సంస్థ ఆటో మొబైల్‌ విడిభాగాలను తయారు చేస్తుంది.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో 850 కోట్ల రూపాయలతో పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఇక... సీయాన్‌ సంస్థకు వాహనాల డోర్‌ ప్యానల్స్‌, సీట్లు, బంపర్లు, మోల్డింగ్స్‌తో పాటు ఫోమ్‌లు, కుషన్ల తయారీలో మంచి పేరుంది. ఈ కంపెనీ రూ.514 కోట్ల పెట్టుబడితో ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిశ్రమ ఏర్పాటుపై ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీలోని పెనుకొండలో ఇప్పటికే కియా కార్ల కంపెనీ ఉంది. దానికి అనుబంధంగా అనేక పరిశ్రమలు వచ్చాయి... వస్తున్నాయి. మరోవైపు... మరో రూ.18 వేల కోట్లతో పెనుకొండలోని తమ యూనిట్‌ను విస్తరించాలని ‘కియా’ నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే హాషిన్‌, సీయాన్‌ కూడా తమ యూనిట్లను ఏపీలో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చినట్లు రాష్ట్ర అధికారులు చెబుతున్నారు.


తమిళనాడును కాదని...

ఏపీలో జరిగిన పెట్టుబడుల సదస్సులో 9 లక్షల కోట్లకుపైగా విలువైన ఒప్పందాలు జరగ్గా... అందులో రెండు కంపెనీలకు సంబంధించిన రూ.1364 కోట్ల ఒప్పందాలు మాత్రమే ఎందుకు కలకలం సృష్టిస్తున్నాయి? దీనికి కారణం ఉంది! హాషిన్‌, సీయాన్‌ కంపెనీలు తొలుత తమిళనాడును ఎంచుకుని, తర్వాత ఏపీకి వెళ్లిపోయాయని విపక్ష డీఎంకే చెబుతోంది. ఏపీలో పెట్టుబడుల సదస్సు ఈ నెల 12, 13 తేదీల్లో జరగగా... డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్‌ అంతకు పదిరోజుల ముందే ‘‘హాషిన్‌, సీయాన్‌ కంపెనీలు ఏపీకి వెళ్లిపోతున్నాయి’’ అని ట్వీట్‌ చేశారు.

పెట్టుబడుల కోసం తమ హయాంలో ఏర్పాటు చేసిన ‘గైడెన్స్‌ తమిళనాడు’ ఏజెన్సీని విజయ్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని... పరిశ్రమలను ప్రోత్సహించడం లేదని మండిపడ్డారు. ఇది తమిళనాట కలకలం సృష్టించింది. పెట్టుబడుల సమాచారం ఏపీకి లీక్‌ అయ్యిందనే విషయం ఎలా ఉన్నా... హాషిన్‌, సీయాన్‌ సంస్థలు ఏపీకి వెళ్లిపోతున్నట్లు స్టాలిన్‌కు ముందే ఉప్పందించారా? తమ ప్రభుత్వంలో ఉంటూ డీఎంకే కోసం పని చేశారా? అనే అనుమానాలు విజయ్‌ సర్కారులో బలంగా తలెత్తాయి.

ఈ క్రమంలోనే ‘గైడెన్స్‌ తమిళనాడు’లోని 15 మంది ఉద్యోగులపై వేటు వేటుడింది. ఈ నోడల్‌ ఏజెన్సీలో ఐఏఎ్‌సలతోపాటు ఔట్‌సోర్సింగ్‌/కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే నిపుణులూ ఉంటారు. ఇప్పుడు వేటుపడిన వారంతా కాంట్రాక్టు ఉద్యోగులే. ఉద్యోగాలు పోయిన వారిలో ముగ్గురు ఏపీ ప్రభుత్వంలోని ఆర్థిక అభివృద్ధి మండలి (ఈడీబీ)లో చేరడాన్ని ఇప్పుడు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.

అయితే... ప్రభుత్వం మారగానే కన్సల్టెన్సీలు, కన్సల్టెంట్లు మారడం సహజం. టీవీకే సర్కారు తమ సేవలను తగిన స్థాయిలో వాడుకోకపోవడంతో 15 మందికి నోడల్‌ ఏజెన్సీయే ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. వారిలో కొందరు ఏపీలో, మరికొందరు కేరళ, కర్ణాటకతోపాటు ఇతర రాష్ట్రాల్లో కొత్త ఉద్యోగాల్లో చేరారని తెలుస్తోంది.


కొసమెరుపు

‘గైడెన్స్‌ తమిళనాడు’లోని 15 మందిపై వేటు వేసినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రభుత్వం మారినప్పటి నుంచే కొందరిని తీసేయడం మొదలైంది. మరికొందరు వారే కొత్త ఉద్యోగాలు వెతుక్కున్నారు. వెరసి... ఈ వివాదమంతా ఏపీ-తమిళనాడు మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నమని కొందరు భావిస్తున్నారు.

ఏపీ తీరానికి అక్వాన్ తుపాను ముప్పు.. గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం: ఏపీఎస్‌డీఎంఏ

ఎంపీపీ ఎన్నికల్లోనూ కూటమి హవా

Updated Date - Nov 20 , 2026 | 04:23 AM