Share News

టీవీకే పార్టీతో చర్చలు.. యోచనలో అన్నాడీఎమ్‌కే

ABN , Publish Date - Apr 30 , 2026 | 05:35 PM

తమిళనాడు ఎన్నికల్లో నటుడు విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీకి భారీ స్థాయిలో సీట్లు దక్కే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో అన్నాడీఎమ్‌కే పార్టీ విజయ్‌తో చర్చలు జరిపే యోచనలో ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.

టీవీకే పార్టీతో చర్చలు.. యోచనలో అన్నాడీఎమ్‌కే
AIADMK - TVK Talks

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు ఎన్నికల్లో స్టాలిన్ సారథ్యంలో డీఎమ్‌కే మరోసారి అధికారంలోకి వస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే, ప్రముఖ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా భారీ స్థాయిలో సీట్లు గెలుచుకునే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష అన్నాడీఎమ్‌కే టీవీకే పార్టీతో పోత్తు దిశగా అడుగులు వేయవచ్చన్న కథనాలు వెలువడుతున్నాయి. పార్టీ అధినేత విజయ్‌తో చర్చలు జరిపే అవకాశాన్ని అన్నాడీఎమ్‌కే పరిశీలిస్తున్నట్టు సమాచారం.

తమిళనాడులో మొత్తం 234 సీట్లకు గాను ఇటీవల ఒకే విడతలో పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో విజయ్‌ పార్టీకి చెప్పుకోదగ్గ స్థాయిలోనే ప్రజల మద్దతు లభించినట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. విజయ్ పార్టీ ఏకంగా 98 - 120 సీట్లు గెలుచుకోవచ్చని యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్‌ అంచనా వేసింది. డీఎమ్‌కే-కాంగ్రెస్‌కు 92-110 సీట్లు రావొచ్చని పేర్కొంది. ఎన్డీయే 32 స్థానాల్లో గెలవొచ్చని అంచనా వేసింది. యాక్సిస్ మైపోల్ సర్వే ప్రకారం, టీవీకేకు ఈసారి 35 శాతం వరకూ ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ప్రతిపక్ష అన్నా డీఎమ్‌కేకు 23 శాతం ఓట్లు వచ్చే ఛాన్సుంది.


ఇక విజయ్ ముఖ్యమంత్రి కావాలని ఏకంగా 37 శాతం మంది ఓటర్లు అభిప్రాయపడ్డారు. ఈ అంశంలో సీఎం స్టాలిన్‌ (35 శాతం) కంటే అధికంగా ప్రజల మద్దతు విజయ్‌కు లభించడం గమనార్హం. యువత, ముఖ్యంగా తొలిసారిగా ఓటు వేసే వారు, నగర ప్రాంతాల ఓటర్లు, నిరుద్యోగ యువత నుంచి విజయ్‌కు ఎక్కువగా మద్దతు లభించినట్టు యాక్సిస్ మైపోల్ అంచనా వేసింది. గ్రామీణ ప్రాంతాల ఓటర్లతో పాటు ఓబీసీ, ఎస్సీ వర్గాల నుంచి కూడా విజయ్‌కు మద్దతు లభించినట్టు సర్వేలో తేలింది.


ఈ వార్తలనూ చదవండి:

నటి కరిష్మా కపూర్‌కు ఊరట! మాజీ భర్త ఆస్తుల విక్రయానికి కోర్టు బ్రేకులు

రూ.45 లక్షల కోసం కూతురి ఘాతుకం.. ప్రియుడితో కలిసి తల్లిని..

Updated Date - Apr 30 , 2026 | 05:51 PM