తమిళనాట విజయ్ ప్రభంజనం.. ద్రావిడ కోటలు బద్దలు.. సెయింట్ జార్జ్ కోట దిశగా 'దళపతి'!
ABN , Publish Date - May 04 , 2026 | 02:55 PM
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారు. తన కొత్త రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం (TVK) ద్వారా ఎన్నికల బరిలోకి దిగిన ఆయన, దశాబ్దాలుగా రాష్ట్రాన్ని ఏలుతున్న ద్రావిడ పార్టీలను విస్మయానికి గురిచేశారు.
చెన్నై, మే 4: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం (TVK) ద్వారా ఎన్నికల బరిలోకి దిగిన ఆయన, దశాబ్దాలుగా రాష్ట్రాన్ని ఏలుతున్న ద్రావిడ పార్టీలను విస్మయానికి గురిచేశారు. తాజా ట్రెండ్స్ ప్రకారం, విజయ్ నేతృత్వంలోని టీవీకే ఏకంగా 109 స్థానాల్లో ముందంజలో ఉండి, రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించే దిశగా దూసుకుపోతోంది.
రాజకీయాల్లో సరికొత్త 'జననాయగన్'
సినిమా స్టార్‌లు రాజకీయాల్లో రాణించలేరన్న అపవాదును చెరిపివేస్తూ, విజయ్ తన సినీ పాపులారిటీని ఓట్లుగా మార్చుకోవడంలో సఫలమయ్యారు. తద్వారా దివంగత నేతలు ఎన్టీ రామారావు, ఎంజీ రామచంద్రన్, జయలలిత వంటి దిగ్గజాల సరసన ఆయన నిలిచారు. 1977 తర్వాత తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకే కాకుండా మరో పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయడం ఇదే తొలిసారి.
వారసత్వ రాజకీయాలకు ముగింపు: టీవీకే ధీమా
పార్టీ అధికార ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ మాట్లాడుతూ.. 'ఇది కుటుంబ రాజకీయాలకు, అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పు. ఎవరి మద్దతు లేకుండానే మేము సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం' అని ధీమా వ్యక్తం చేశారు. విజయ్ నివాసం వద్ద ఆయన కుటుంబ సభ్యులు పార్టీ గుర్తు అయిన 'విజిల్' సాంగ్‌తో సంబరాలు చేసుకుంటున్నారు.
మెజారిటీ మార్కు 118కి టీవీకే చేరువలో ఉంది. చిన్న పార్టీల మద్దతుతో లేదా స్వతంత్రంగా విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో చెన్నైలోని టీవీకే ప్రధాన కార్యాలయం వద్ద కార్యకర్తలు మిఠాయిలు పంచుకుంటూ, జెండాలు ఊపుతూ పండుగ చేసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి..
ఐదు రాష్ట్రాల ఫలితాల వేళ ప్రధాని మోదీ ఆసక్తికర పోస్ట్.. నైపుణ్యం, కృషి, కరుణపై సందేశం
ఓట్ల లెక్కింపు వేళ.. మురుగు కాలువలో వీవీప్యాట్ స్లిప్పులు.. స్పందించిన ఈసీ