Share News

అమ్మ క్యాంటీన్లలో మౌలిక సదుపాయాల మెరుగుదలపై సీఎం విజయ్ కీలక ఆదేశాలు..

ABN , Publish Date - May 18 , 2026 | 09:32 PM

జయలలిత హయాంలో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటైన అమ్మ క్యాంటీన్ల విషయంలో ముఖ్యమంత్రి విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమ్మ క్యాంటీన్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని ఆదేశాలు జారీ చేశారు.

అమ్మ క్యాంటీన్లలో మౌలిక సదుపాయాల మెరుగుదలపై సీఎం విజయ్ కీలక ఆదేశాలు..
Vijay Amma canteens

జయలలిత హయాంలో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటైన అమ్మ క్యాంటీన్ల (Amma Unavagams) విషయంలో ముఖ్యమంత్రి విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమ్మ క్యాంటీన్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని ఆదేశాలు జారీ చేశారు. క్యాంటీన్లలో మౌలిక వసతులు, పరిశుభ్రత, ఆహార నాణ్యతను మెరుగుపర్చాలని అధికారులను ఆదేశించినట్లు తమిళనాడు సీఎం కార్యాలయం వెల్లడించింది (Vijay Amma canteens).


ఇటీవల అమ్మ క్యాంటీన్లలో అందిస్తున్న ఆహారం నాణ్యత, రుచిపై ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో సీఎం విజయ్ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. అనేక కేంద్రాల్లో అత్యవసర మరమ్మత్తులు అవసరమని గుర్తించిన ప్రభుత్వం, వెంటనే పునరుద్ధరణ పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. క్యాంటీన్లకు కొత్త వంట పాత్రలు, కిచెన్ పరికరాలను అందించనున్నారు. అలాగే నిల్వ సదుపాయాలు, భోజన హాళ్లను ఆధునీకరించనున్నారు. ప్రజలకు రుచికరమైన, నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం విజయ్ స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు (Tamil Nadu Amma canteen revamp).


తమిళనాడులో గ్రేటర్ చెన్నై పరిధిలో 383 అమ్మా క్యాంటీన్లు పనిచేస్తుండగా, ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో మరో 237 క్యాంటీన్లు ఉన్నాయి (Vijay government news). రాష్ట్రవ్యాప్తంగా 620కు పైగా క్యాంటీన్లు.. పేదలు, రోజువారీ కూలీలు, తక్కువ ఆదాయ వర్గాలకు తక్కువ ధరల్లో భోజనం అందిస్తున్నాయి. అమ్మ క్యాంటిన్లను 2013లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత ప్రారంభించారు. ఒక్క రూపాయికి ఇడ్లీ, తక్కువ ధరలకు భోజనం అందించే ఈ పథకం తమిళనాడులో అత్యంత ప్రజాదరణ పొందింది. తరువాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఈ పథకాన్ని కొనసాగించాయి.


ఇవి కూడా చదవండి..

సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం.. మార్కులు పెరిగితే రీ-ఎవాల్యుయేషన్ ఫీజు పూర్తిగా రీఫండ్..


ఉగ్రవాదికి బట్టతల కష్టాలు.. దాడులు చేయడానికి భారత్‌లోకి చొరబడి..

Updated Date - May 18 , 2026 | 09:39 PM