Share News

సీఎం విజయ్ సంచలన ప్రకటన.. పొంగల్ నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు..

ABN , Publish Date - Aug 24 , 2026 | 11:06 AM

తమిళనాడు అసెంబ్లీ వేదికగా మహిళలపై ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ వరాల జల్లు కురిపించారు. ఎన్నికల హామీ మేరకు సోమవారం అసెంబ్లీ సాక్షిగా పలు సంక్షేమ పథకాలను ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు.

సీఎం విజయ్ సంచలన ప్రకటన.. పొంగల్ నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు..
Tamil Nadu CM Vijay

చెన్నై: తమిళనాడు అసెంబ్లీ వేదికగా మహిళలపై ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ వరాల జల్లు కురిపించారు. ఎన్నికల హామీ మేరకు ఇవాళ (సోమవారం) శాసనసభ సాక్షిగా పలు సంక్షేమ పథకాలను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత ఎల్‌పీజీ సిలిండర్లు అందించనున్నట్లు సీఎం విజయ్ ప్రకటించారు.


‘అన్నపూర్ణి సూపర్ సిక్స్’ పథకం కింద దీనిని అమలు చేయనున్నట్లు సీఎం విజయ్ పేర్కొన్నారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు నేరుగా జమ అయ్యేలా పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఉచిత ఎల్‌పీజీ సిలిండర్ల పథకాన్ని వచ్చే ఏడాది పొంగల్ పండుగ నుంచి అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ పథకం కింద సుమారు 1.30 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. అలాగే రాష్ట్ర ఖజానాపై ఏడాదికి సుమారు రూ.4,000 కోట్ల వ్యయం పడనుంది.


మహిళలు, ట్రాన్స్‌జెండర్ల కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని మరింత విస్తరిస్తూ ‘వెట్రి పయన తిట్టం’ పథకాన్నీ సీఎం విజయ్ ప్రకటించారు. ఈ పథకం ద్వారా ట్రాన్స్‌జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రకటించడంతో పాటు మహిళల కోసం దీని పరిధిని విస్తరించారు. ఇకపై ఎక్స్‌ప్రెస్, లిమిటెడ్ స్టాప్ సర్వీస్, డీలక్స్ సర్వీసుల బస్సుల్లోనూ మహిళలు, ట్రాన్స్‌జెండర్లు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించనున్నారు. ఉచిత ప్రయాణం పొందేందుకు ఆదాయ పరిమితి, ప్రయాణాల సంఖ్యపై ఎలాంటి నిబంధనలు ఉండవని సీఎం స్పష్టం చేశారు. కాగా, గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2 నుంచి ఈ పథకం అమల్లోకి రానుందని తెలిపారు.


అలాగే, అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంచలన నిర్ణయం ప్రకటించారు. చెన్నై శివార్లలోని పరందూర్‌లో రెండో విమానాశ్రయం నిర్మించాలన్న ప్రతిపాదనను తమ ప్రభుత్వం విరమించుకుంటున్నట్లు తెలిపారు. విమానాశ్రయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న వారికి తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. 'పరందూర్ విమానాశ్రయ ప్రాజెక్టును విరమించుకుంటున్నాం. ప్రతిపాదిత విమానాశ్రయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న నిరసనకారులకు నేను అండగా ఉంటా' అని విజయ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

మహారాష్ట్ర థానేలో వైద్యుడిపై దాడి.. బూతులు తిడుతూ..

సుప్రీంకోర్టుకు జర్నలిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయ్.. ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని పిటిషన్..

Updated Date - Aug 24 , 2026 | 11:21 AM