Share News

మహారాష్ట్ర థానేలో వైద్యుడిపై దాడి.. బూతులు తిడుతూ..

ABN , Publish Date - Aug 24 , 2026 | 08:12 AM

మహారాష్ట్రలో వైద్యుడిపై దాడి మరోసారి కలకలం రేపింది. థానేలోని కల్యాణ్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రోగిని పరీక్షిస్తున్న వైద్యుడిపై దాడి జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మహారాష్ట్ర థానేలో వైద్యుడిపై దాడి.. బూతులు తిడుతూ..
Doctor Assaulted

థానే: మహారాష్ట్రలో వైద్యుడిపై దాడి మరోసారి కలకలం రేపింది. థానేలోని కల్యాణ్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రోగిని పరీక్షిస్తున్న వైద్యుడిపై అతని కుమారుడు దాడికి పాల్పడ్డాడు. డాక్టర్‌ను దుర్భాషలాడుతూ కొట్టడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఓ మహిళా వైద్యురాలితో పాటు ఆస్పత్రి సిబ్బందిపై శివసేన కార్పొరేటర్ రమేశ్, అతని అనుచరులు దాడికి పాల్పడటం తెలిసిందే. ఆ దాడి సంచలనం సృష్టించిన కొన్ని రోజులకే తాజాగా మరో ఘటన జరగడంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


శనివారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో దేశ్‌ముఖ్ అనే రోగిని ఆర్థోపెడిక్ వైద్యుడు డాక్టర్ యోగేంద్ర జైస్వాల్ పరీక్షిస్తున్నారు. అతని పక్కటెముకకు గాయం కావడంతో చికిత్సా విధానం, బ్యాండేజ్ ఎలా వేయాలి, మందులు ఎలా వాడాలనే విషయాలను జైస్వాల్ వివరిస్తున్నారు. ఈ సమయంలో రోగి కుమారుడు ఒకే ప్రశ్నను పదేపదే అడుగుతూ అభ్యంతరకర భాషను ఉపయోగించాడు. దీనిపై డాక్టర్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ‘నువ్వేమైనా పెద్ద డాక్టరువా?’ అంటూ రోగి కుమారుడు ప్రశ్నించినట్లు జైస్వాల్ వెల్లడించారు. అనంతరం బయటకు వెళ్లి తనను దూషించాడని, తాను అభ్యంతరం చెప్పడంతో తిరిగి వచ్చి దాడి చేశాడని ఆరోపించారు. తనపై దాడి చేసిన వ్యక్తిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని ఇంకా అరెస్టు చేయలేదు.


ఇటీవలే డొంబివ్లిలోనూ ఓ వైద్యురాలిపై దాడి ఘటన కలకలం రేపింది. కల్యాణ్-డొంబివ్లి ప్రాంతానికి చెందిన శివసేన కార్పొరేటర్ రమేశ్.. ఓ మహిళా వైద్యురాలిపై దాడి చేయడం సంచలనమైంది. కార్పొరేటర్, ఆయన అనుచరులు ఆస్పత్రి సిబ్బందిపైనా దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, వరుస దాడులతో వైద్యుల్లో ఆందోళన నెలకొంది. తమకు భద్రత కల్పించాలని, దాడులకు పాల్పడే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని వైద్యులు, సిబ్బంది కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

రెండు కార్లు ఢీకొని ఇద్దరు ఎమ్మెల్యేలు సహా ఆరుగురికి గాయాలు..

ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు నవజాత శిశువుల సజీవ దహనం..

Updated Date - Aug 24 , 2026 | 08:16 AM