రెండు కార్లు ఢీకొని ఇద్దరు ఎమ్మెల్యేలు సహా ఆరుగురికి గాయాలు..
ABN , Publish Date - Aug 24 , 2026 | 07:19 AM
రెండు కార్లు ఢీకొని ఇద్దరు ఎమ్మెల్యేలు సహా ఆరుగురు గాయపడిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఐటీవో ప్రాంతంలో ఆదివారం రాత్రి ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.
న్యూఢిల్లీ: రెండు కార్లు ఢీకొని ఇద్దరు ఎమ్మెల్యేలు సహా ఆరుగురు గాయపడిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఐటీవో ప్రాంతంలో ఆదివారం రాత్రి ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీలోని కిరారి ఎమ్మెల్యే అనిల్ ఝా, కర్ణాటక ఎమ్మెల్యే అభయ్ పటేల్ ఓ ఎస్‌యూవీ కారులో ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో అశుతోశ్ పాండే (32) దంపతులు తమ ఇద్దరు పిల్లలతో లక్ష్మీనగర్ నుంచి ఐటీవో వైపునకు మరో కారులో వెళ్తున్నారు.
అయితే, రాత్రి సుమారు 9:30 గంటలకు పీడబ్ల్యూడీ కార్యాలయం సమీపానికి రాగానే ఆ కుటుంబం ప్రయాణిస్తున్న కారులోని సిలిండర్ ఒక్కసారిగా పేలింది. దీంతో వాహనం నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత రైలింగ్‌ను దాటి ఎదురుగా వస్తున్న ఎమ్మెల్యేల కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు బాధిత కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవడంతో ప్రాణనష్టం తప్పింది. ప్రమాద తీవ్రతకు రెండు కార్ల ముందు భాగాలు ధ్వంసమయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, బాధితుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనతో ఐటీవో క్రాసింగ్ వద్ద ట్రాఫిక్‌కు కాసేపు అంతరాయం ఏర్పడింది. అనంతరం ప్రమాదానికి గురైన రెండు కార్లను రోడ్డుపై నుంచి పోలీసులు తొలగించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు సిలిండర్ పేలడానికి గల కచ్చితమైన కారణాన్ని తెలుసుకునేందుకు విచారణ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
అత్తింటి వేధింపులు.. రక్షణ శాఖ అధికారిణి ఆత్మహత్య
భారత రాకెట్ ప్రయోగాలు చాలా కాస్ట్‌లీ!