భారత రాకెట్ ప్రయోగాలు చాలా కాస్ట్‌లీ!
ABN , Publish Date - Aug 24 , 2026 | 07:06 AM
అంతరిక్ష ప్రయోగాల కోసం భారత్ చేస్తున్న ఖర్చు చాలా ఎక్కువగా ఉంటోందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకుల తాజా అధ్యయనం చెబుతోంది. లో ఎర్త్ ఆర్బిట్ (ఎల్‌ఈవో)లోకి ఒక కిలో పేలోడ్‌ను...
అమెరికాతో పోలిస్తే నాలుగు రెట్లు అధికం
కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి
తప్పుడు డేటా అంటూ కొట్టిపారేసిన ఇస్రో
న్యూఢిల్లీ, ఆగస్టు 23: అంతరిక్ష ప్రయోగాల కోసం భారత్ చేస్తున్న ఖర్చు చాలా ఎక్కువగా ఉంటోందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకుల తాజా అధ్యయనం చెబుతోంది. లో ఎర్త్ ఆర్బిట్ (ఎల్‌ఈవో)లోకి ఒక కిలో పేలోడ్‌ను పంపించేందుకు భారత్(ఇస్రో) ఏకంగా 13,302 డాలర్లు ఖర్చు చేస్తోందని ఈ అధ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష ప్రయోగాలు నిర్వహిస్తున్న దేశాలతో పోలిస్తే ఈ ఖర్చు ఎక్కువని పేర్కొంది. అమెరికాతో పోలిస్తే నాలుగు రెట్లు అధికమని తెలిపింది. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన ఆర్థికవేత్త అలెస్సియో టెర్జీ, ఇటలీలోని పాలిటెక్నికో డి టురినోకు చెందిన ఫ్రాన్సెస్కో నికోలి నేతృత్వంలో నిర్వహించిన ఈ అధ్యయన వివరాలు ప్రతిష్ఠాత్మక జర్నల్ ‘ఎకనామిక్స్ లెటర్స్’లో ప్రచురితమయ్యాయి. 1960 నుంచి 2025 మధ్య ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన 6,740 రాకెట్ ప్రయోగాల డేటా బేస్ ఆధారంగా పరిశోధకులు ఈ విశ్లేషణ చేశారు. ఈ క్రమంలో 2025లో అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి ఒక కిలో పేలోడ్ ప్రయోగానికి అయ్యే ప్రపంచ సగటు ఖర్చును 3,868 డాలర్లుగా నిర్ధారించారు. అయితే, ఇస్రో చైర్మన్ నారాయణన్ ఈ అధ్యయనాన్ని కొట్టిపారేశారు. తప్పుడు డేటాను ఉపయోగించి ఈ అధ్యయనం చేపట్టారని విమర్శించారు. ఇస్రో మాజీ చైర్మన్ ఎస్ సోమనాథ్ కూడా ఈ నివేదికను వ్యతిరేకించారు.