సుప్రీంకోర్టుకు జర్నలిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయ్.. ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని పిటిషన్..
ABN , Publish Date - Aug 24 , 2026 | 10:14 AM
ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు తనపై తప్పుడు కేసు పెట్టారని సుప్రీంకోర్టును ప్రముఖ జర్నలిస్టు అభిషేక్ ఉపాధ్యాయ్ ఆశ్రయించారు. అక్రమంగా కేసు బనాయించారని, అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
ఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు తనపై అక్రమంగా కేసు పెట్టారని సుప్రీంకోర్టును ప్రముఖ జర్నలిస్టు అభిషేక్ ఉపాధ్యాయ్ ఆశ్రయించారు. తప్పుడు కేసు బనాయించారని, అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అయోధ్య రామాలయ విరాళాల చోరీని బయటపెట్టినందుకే తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టారని అభిషేక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే రద్దు చేయాలని కోరారు. తనపై ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టకుండా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఆగస్టు 18న అభిషేక్ కారుతో ఓ ద్విచక్ర వాహనదారుడిని ఢీకొట్టారని ఇందిరాపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
అయితే, పోలీసులు దురుద్దేశపూర్వకంగానే కేసు పెట్టారని అభిషేక్ ఆరోపిస్తున్నారు. జూన్ 7న రామ మందిర విరాళాల దుర్వినియోగాన్ని బయట పెట్టినప్పటి నుంచి తనపై ఫిర్యాదులు, ఎఫ్‌ఐఆర్‌లు నిత్యకృత్యంగా మారాయని అన్నారు. ఆగస్టు 18న తన కుమార్తెను పాఠశాల నుంచి తీసుకెళ్తుండగా షిప్రా మాల్ సమీపంలో ఓ బైకర్ తన కారుకు దగ్గరగా వచ్చి గందరగోళం సృష్టించాడని అభిషేక్ పిటిషన్‌లో పేర్కొన్నారు. తన కారు ఎవ్వరినీ ఢీకొట్టలేదని, బైకర్‌తో వాగ్వాదం మాత్రమే జరిగిందని తెలిపారు. అయితే, పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి సీసీటీవీ రికార్డింగ్‌లను తొలగించేలా స్థానిక దుకాణదారులపై ఒత్తిడి తెచ్చారని ఆయన ఆరోపించారు. కేసుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను భద్రపరిచేలా ఆదేశించాలని కోరారు.
ఈ కేసు విషయమై ఆగస్టు 20న రాత్రి తాను ఢిల్లీలో ఉండగా పోలీసులు ఘజియాబాద్‌లోని నివాసానికి వెళ్లారని అభిషేక్ పేర్కొన్నారు. అర్ధరాత్రి వేళ సుమారు తొమ్మిది మంది పోలీసులు తన ఇంట్లోకి ప్రవేశించి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారని పిటిషన్‌లో నివేదించారు. యూపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని, కేసు దర్యాప్తును ఢిల్లీ పోలీసులు లేదా సీబీఐ వంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
రెండు కార్లు ఢీకొని ఇద్దరు ఎమ్మెల్యేలు సహా ఆరుగురికి గాయాలు..
ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు నవజాత శిశువుల సజీవ దహనం..