ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు నవజాత శిశువుల సజీవ దహనం..
ABN , Publish Date - Aug 24 , 2026 | 07:55 AM
మహారాష్ట్రలోని అమరావతిలో సోమవారం ఉదయం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఆస్పత్రి స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్‌లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి ముగ్గురు నవజాత శిశువులు సజీవ దహనమయ్యారు.
ఇంటర్‌నెట్ డెస్క్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్రలోని అమరావతిలో ఇవాళ (సోమవారం) తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. అమరావతి జిల్లా మహిళా ఆస్పత్రిలో మంటలు చెలరేగి ముగ్గురు నవజాత శిశువులు మృతిచెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రి మూడో అంతస్తులోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగం(SNCU)లో 39 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. అయితే, తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో వెంటిలేటర్ ఒక్కసారిగా పేలడంతో మంటలు చెలరేగాయి.
నిమిషాల్లో ఎల్ఎన్సీయూ మొత్తం వ్యాపించాయి. దీంతో పొగ పీల్చడం, తీవ్రమైన కాలిన గాయాలు కారణంగా ముగ్గురు శిశువులు ప్రాణాలు కోల్పోయారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే వైద్యులు, నర్సులు, ఇతర ఆస్పత్రి సిబ్బంది వార్డుకు చేరుకుని చిన్నారులను కాపాడారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురు నవజాత శిశువులను చికిత్స నిమిత్తం సమీపంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి
రెండు కార్లు ఢీకొని ఇద్దరు ఎమ్మెల్యేలు సహా ఆరుగురికి గాయాలు..
మహారాష్ట్ర థానేలో వైద్యుడిపై దాడి.. బూతులు తిడుతూ..